DailyDose

గిలియడ్ మందు పంపిణీకి అమెరికా సిద్ధం-TNI బులెటిన్

గిలియడ్ మందు పంపిణీకి అమెరికా సిద్ధం-TNI బులెటిన్

* దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 4 కోట్ల మార్కును దాటింది.దేశవ్యాప్తంగా రోజుకు 9 లక్షలకుపైగా నమూనాలు పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని అందుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అలాగే ప్రతి 10 లక్షల మందికి పరీక్షల సంఖ్య 29,280కి చేరినట్లు పేర్కొంది.

* ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,548 కరోనా కేసులు.రాష్ట్రంలో కరోనాతో మరో 82 మంది మృతి.రాష్ట్రంలో 4,14,164కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 3,796 మంది మృతి.కరోనా నుంచి కోలుకున్న 3,12,687 మంది బాధితులు.రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో ఇప్పటివరకు 36.03 లక్షల మందికి కరోనా పరీక్షలు.

* గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో కరోనా వైరస్ సోకి ఎవరైనా ప్రయివేటు వైద్యశాలకు వచ్చారంటే ఆస్తులు అమ్ముకోవాలి అన్న చందంగా తయారైంది పరిస్థితి.కరోనా సోకి వైద్యశాలకు వచ్చిన బాధితులను కనికరం కూడా లేకుండా వైద్యశాలల్లో బిల్లులు బాదుతున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు.ఆడిగేవాళ్ళు లేకపోవడంతో వైద్యశాల యాజమాన్యం తమ ఇష్టారాజ్యంగా బాధితుల వద్ద బిల్లులు వేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.ఇటీవల రెంటచింతల మండల మంచికల్లు గ్రామం నుండి శీలమనేని అన్నపూర్ణ అనే మహిళ కరోనా వైరస్ సోకి పిడుగురాళ్ళ పట్టణంలో ఏర్పాటు చేసిన అంజిరెడ్డి హాస్పిటల్ కోవిడ్ సెంటర్ లో చేరింది.

* కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తక్కువ స్థాయిలో ఏసీల వాడకం, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా సౌలభ్యం.. వైరల్‌ లోడ్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని ఏసియా పసిఫిక్‌ జర్నల్ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. అవి భారత్‌ సహా ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయని దిల్లీ, మంగళూరుకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు.

* కరోనా విపత్తు సమయంలో ప్రజలు చూపిన ధాతృత్వం, సాటివారికి ఇచ్చిన ధైర్యం ప్రపంచానికే ఆదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొనియాడారు. గతంలో కరోనా కంటే భయంకరమైన వైరస్‌లు వచ్చినా తట్టుకున్న చరిత్ర దేశానికి ఉందన్నారు. మహమ్మారికి ధైర్యమే అసలైన మందు అని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన హోలిస్టిక్‌ ఛారిటబుల్‌ ట్రస్టు 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ప్రభుత్వానికి అందజేసింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనాతో విలవిల్లాడుతోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌..సంస్థ ఔధార్యాన్ని సజ్జనార్‌ ప్రశంసించారు.

* అమెరికాలో కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరిన వారందరికీ చికిత్సలో భాగంగా రెమ్‌డెసివిర్‌ మందును అందించేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతించింది. ఈ విషయాన్ని గిలీద్‌ సైన్సెస్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి తీవ్ర లక్షణాలున్న వారికే ఈ డ్రగ్‌ను పరిమితం చేశారు. వివిధ స్థాయిల్లో లక్షణాలున్న వారిపై జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగానే రెమ్‌డెసివిర్‌ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతించినట్లు అధికారులు తెలిపారు. మోతాదు లక్షణాలున్న వారికి రెమ్‌డెసివిర్‌ ఇవ్వగా.. 65 శాతం మంది ఐదు రోజుల్లో కోలుకున్నట్లు అధ్యయనంలో తేలిందని గిలీద్‌ తెలిపింది.