Kids

సుబ్బారావు అప్పారావుల కరోనా కథలు

సుబ్బారావు అప్పారావుల కరోనా కథలు

ఓ ఊరిలో ఓ కాలనీలో ఓ కుటుంబంలో సుబ్బారావు అనే వ్యక్తికి కరోనా సోకింది అని ఆ కాలనీ ఉండే వారందరికీ తెలిసింది. సహజంగా కరోనా వచ్చిన వ్యక్తి పక్కింటి వాడికి కూడా తెలియకూడదు అని అనుకుంటాడు.కానీ.. ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. 24 గంటలు కరోనా గురించి వార్తలు చెప్పే మీడియా మైక్ పట్టుకొని మరీ ఫలానా వారికి కరోనా వచ్చిందహో మీరంతా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసారు.తప్పులేదు, కరోనా వచ్చిన వ్యక్తి నుంచి సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఇక కాలనీలో ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం.చాలా మంది అయ్యో పాపం అనుకున్నారు అనుకుంటూనే మనం జాగ్రత్తగా ఉండాలి అని ఓసారి మాస్క్ ని గట్టిగా బిగించి కట్టుకున్నారు. శానిటైజర్ చేతులకి అరచేతి రేఖలు అరిగి పోయేలా పదే పదే రుద్దుకున్నారు. వాట్స్ ప్ మెసేజ్లు చూసి కాషాయం తాగడం చేస్తూ ఉన్నారు. టాక్స్ పేయర్స్ మాత్రం ఇంతకు ముందు క్వాటర్ మందు తాగేవాళ్లు దైర్యం కోసం ఆప్పుచేసి మరీ ఆఫ్ తాగేస్తూ అప్పుల బారినుంచి ప్రభుత్వం బయటపడేందుకు తమ వంతు తాము కృషి చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా…ఆ కాలనీ లో ఉండే అప్పారావు వాడి భార్య సుబ్బారావు ఈ కాలనీలో ఉంటేనే మాకు కరోనా వచ్చేస్తుందని భయపడుతూ ఆ భయాన్ని కాలనీ మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు. సుబ్బారావు అప్పారావుకి దగ్గర బంధువే.ప్రాణం ముందు బంధువు లేడు స్నేహితుడు లేడు.పాపం సుబ్బారావు భార్య పిల్లలు అప్పారావుకి సపోర్ట్ కోసం ఫోన్ చేశారు.మొదట లిఫ్ట్ చేయలేదు.మరోసారి లిఫ్ట్ చేసే అవసరం రాకుండా ఆ నెంబర్ ని బ్లాక్ చేసేసాడు.కరోనా సోకిన సుబ్బారావు కుటుంబాన్ని అంటరాని కుటుంబంగా చూసాడు.వారి మీద జోకులు వేస్తూ వ్యంగంగా మాట్లాడుతూ సుబ్బారావు ఫ్యామిలీకి తెలిసేలా అవమానిస్తూ ఉన్నాడు.కట్ చేస్తే…అప్పారావు కి ఫీవర్ వచ్చింది.ఇది వైరల్ ఫీవరే అని అనుకున్నాడు.పిచ్చినాకొడకా…వైరల్ ఫీవర్ కాదు కరోనా వైరస్ అని కరోనా ఊపిరితిత్తులు నించి గట్టిగా కేక వేసి మరీ చెప్పింది.సుబ్బారావుకి జరిగినట్టే అప్పారావు కుటుంబానికి జరిగింది.ఆ అవమానం ఆ బాధ ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూసాడు.ఆసుపత్రిలో చేరాడు.ఆక్సిజన్ సిలండర్ అప్పారావు ముక్కుకి నిమషాలు వ్యవధిలో సెట్ అయిపోయాయి.కరోనా బారినుంచి కోలుకున్నాడు. డాక్టర్ పాదాల మీద పడి కృతజ్ఞతలు చెప్పాడు.అప్పుడు ఆ డాక్టర్ ‘కేవలం డబ్బు కారణంగానే నువ్వు బతక లేదు.నీకు ఆ వ్యక్తి ప్లాస్మా దానం చేయడం వలన బతికావ్ అని చెప్పాడు.అప్పారావు ఆ వ్యక్తి ఎవరా అని పక్కకి చూసాడు.అంతకుముందు కరోనా నుంచి కోలుకున్న సుబ్బారావు కనిపించాడు.ఎవరినైతే వెలివేసానో,ఎవరినైతే తన మాటలతో చేతలతో అవమానించానో అతనా నన్ను బ్రతికించింది? అని ఏడ్చేసాడు. కరోనాతో చావకపోయినా మానసికంగా ఇప్పుడు చచ్చిపోయాడు.తాను చేసిన తప్పుకి అశ్రువులు సిగ్గుతో కళ్లనించి కారి సుబ్బారావు పాదాల మీద పడ్డాయి. సుబ్బారావు మానవత్వపు హస్తాలు అప్పారావుని హగ్ చేసుకొని దైర్యం చెప్పాయ్.అప్పారావు ఇప్పుడు మనిషై పోయాడు అదే… మారిపోయాడు. డాక్టర్ తో సార్ ఎవరికైనా ప్లాస్మా కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి అని అన్నాడు.కొంతమందికి మార్పు ఊరికే రాదు చావు దెబ్బ తిన్నప్పుడు మాత్రమే వస్తుంది.ఈ కథలో అప్పారావులాగ.