NRI-NRT

శాక్రిమెంటోలో వినాయక చవితి

TAGS Sacremento Vinayaka Chaviti And Bhagavatam

శాక్రమెంటో నగరంలో “శాక్రమెంటో తెలుగు సంఘం “(టాగ్స్ ) ఆధ్వర్యంలో ఘనం గా జరిగిన “వినాయక చవితి శ్లోక పఠనం”, “పలికెద భాగవతం” కార్యక్రమాలు

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట రాజధాని శాక్రమెంటో నగరంలో “శాక్రమెంటో తెలుగు సంఘం” (టాగ్స్ ) ఆధ్వర్యంలో వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా ఆగస్టు 22న “వినాయక చవితి శ్లోక పఠనం”, ఆగస్టు 23న “పలికెద భాగవతం” కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.

‘తూర్పు ఇటాలియన్ భాషగా’ పొగడబడ్డ అందమైన తెలుగుభాషను కొత్త తరం నేర్చుకోకపోతే త్వరలోనే మనదైన భాష కనుమరుగౌతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కొత్త భాషను రూపొందించడానికి 500 ఏండ్లు పడితే, సదరు భాషను అంతమొందించడానికి 200 ఏండ్లు చాలని పరిశోధకుల ఉవాచ. వేల ఏండ్లుగా సరికొత్త సొగసులు అందిపుచ్చుకున్న మన ఈ అందమైన భాష యొక్క సంక్లిష్టతలను జీవితకాలం అంకితం చేసినా పూర్తి ప్రావీణ్యం పొందినవారు అరుదు అన్నది నిజం. కానీ ఆదివారం ఆగస్టు 23, 2020 వ తారీఖున ఉదయం 10 గం కు , తెలుగు సంస్కృతి యొక్క రత్నం “పోతన భాగవతం” ను పఠించేందుకు టాగ్స్ ఆధ్వర్యంలో అంతర్జాల సమావేశం ద్వారా ముప్పై మంది విద్యార్థులు కలిసి ఈ దిశగా కొత్త జ్యోతిని వెలిగించారు. గ్రేటర్ శాక్రమెంటో ప్రాంతానికి చెందిన ప్రవాస తెలుగు విద్యార్థులు పోతన భాగవతంలో ఒక పాదం లేదా ఏకంగా మొత్తం పద్యం ను పాడటం ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు గంటల వ్యవధిలో ప్రవాస తెలుగు విద్యార్థులు పఠించిన బమ్మెర పోతన యొక్క భాగవత కథ పద్యాలు, కృష్ణుడిని కీర్తించే మధురమైన పద్యాలు, వాటి తాత్పర్యం మరియు శ్రావ్యమైన పాటలు సమావేశంలో పాల్గొన్నవారిని ఆకట్టుకున్నాయి. తెలుగు భాష నేర్చుకోవడంపై తరువాతి తరం ఆసక్తిని అనుమానించేవారు తమ అభిప్రాయాన్ని మార్చుకునేవిధంగా, సమావేశంలో పాల్గొన్న ప్రవాస తెలుగు విధ్యార్ధులు ద్విగుణీకృత ఆత్మవిశ్వాసం, మరియు వాగ్ధాటితో పద్యాలను పఠించారు. ప్రముఖ నేపధ్య గాయకుడు, స్వరకర్త శ్రీ పార్థు నేమాని ఈ కార్యక్రమాన్ని ప్రవాస తెలుగు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పార్థు గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించడంతో పాటు వారి భవిష్యత్ ప్రదర్శనలకు విలువైన సూచనలు ఇచ్చారు. ఈ అంతర్జాల సమావేశానికి హాజరైన 100 మందికి పైగా వీక్షకులు – తెలుగు సంస్కృతికి తమవంతు సేవ చెయ్యడానికి-ముఖ్యంగా ప్రపంచ మహమ్మారి సమయంలో ప్రవాస తెలుగు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి రావడం గొప్ప విషయమని చెప్పారు. ఈ రోజున, తరువాతి తరం చూపించిన ప్రతిభ – అద్భుతమైన తెలుగు సంస్కృతికి ఒక దీపపు స్థంభం వలే ఉంది అని పలువురు వక్తలు చెప్పారు.

“పలికెద భాగవతము” కార్యక్రమానికి సహకారం అందించిన శ్రీ పార్థు నేమని కి టాగ్స్ కోశాధికారి మోహన్ కాట్రగడ్డ కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రతి ప్రవాస విద్యార్థి, వారు పఠించిన కవితల శైలులతో పాటు అర్థాన్ని వారు పట్టుకొని, భావం గ్రహించారని నిర్ధారించుకోవడానికి పార్థు గారు నెలల ముందుగానే తన శిక్షణ ను ప్రారంభించారు అని, ప్రతివారం శిక్షణా సమావేశాలను నిర్వహించి మరియు ఎల్లప్పుడూ సూచనలు అందిస్తూ, సహాయం అవసరమైన ప్రతి ప్రవాస విద్యార్థి కోసం పార్తు గారు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నారని టాగ్స్ అధ్యక్షులు నాగ్ దొండపాటి ప్రశంసించారు. టాగ్స్ ట్రస్టీ వెంకట్ నాగం “పిల్లలు చాలా చక్కగా పోతన భాగవతం పద్యాలు పాడుతున్నారు. భావం కూడా వర్ణిస్తున్నారు. మంచి కార్యక్రమాన్ని అందించిన టాగ్స్ కార్యవర్గానికి అభినందనలు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, గురువు పార్ధు గారికి శుభాభినందనలు” అని చెప్పారు. మరో వీక్షకుడు శ్యాం అరిబింది “ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పల్లెలో పరిచయం చేయడం ద్వారా తెలుగు భాషను బ్రతికించుకోవాలని” చెప్పారు. టాగ్స్ ట్రస్టీ మనోహర్ మందడి “ఉచ్చారణ, పటిమ మరియు శ్రవణ గ్రహణశక్తి వంటి కీలక విషయాలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలుగు పిల్లలు పురోగతి సాధించారని” ప్రశంసించారు. మరో వీక్షకుడు శ్రీనివాస్ విశ్వనాధ “విదేశాలలో ఉండి తెలుగు భాష మీద, తెలుగు వారి సొత్తు అయిన పద్య పఠనం మరియు గానం మీద అత్యంత ఉత్సాహం చూపించే విధంగా పిల్లలని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, గురువుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను” అని చెప్పారు. ఆనురాధ చివుకుల “అమెరికా లొ ఉండి కూడా చక్కటి ఉచ్చారణ తో ఇంత బాగా చెప్పారు. మా లాంటి పెద్ద వాళ్ళకి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పిల్లల మధ్య ఉండి ప్రత్యక్ష్యంగా వారి పద్యాలను వినాలనే కోరిక కలుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని అందించిన పార్థు అభినందనీయుడు” అని ఫేస్ బుక్ ద్వారా చెప్పారు.

టాగ్స్ నిర్వహించిన వినాయక శ్లోకాల పఠనం కార్యక్రమం ఆగస్టు 22న ఉదయం 10 గం కు ఘనంగా జరిగింది. మన పండుగల్లో అతిపెద్ద పండుగలలో ఒకటైన వినాయకచవితి పండుగ సందర్భంగా శ్లోక పఠన కార్యక్రమాన్నిప్రత్యేకంగా ప్రవాస తెలుగు పిల్లల కోసం టాగ్స్ నిర్వహించింది. అంతర్జాల సమావేశం ద్వారా ఈ కార్యక్రమాన్ని టాగ్స్ నిర్వహించింది మరియు దానిని టాగ్స్ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. 25 మందికి పైగా స్థానిక ప్రవాస తెలుగు పిల్లలు గణాధిపతి మరియు విఘ్నాలను తొలగించే వినాయకుడిని స్తుతిస్తూ 50 కి పైగా శ్లోకాలు, కీర్తనలు పాడారు. ప్రవాస తెలుగు పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ను ఇచ్చారని పలువురు వక్తలు చెప్పారు. వీక్షకురాలు శ్రీదేవి దగ్గుల “పిల్లలు చక్కగా వినాయక శ్లోకాలు పఠించారు. ఈ అవకాశం పిల్లలకు కల్పించిన టాగ్స్ సంస్థకు అభినందనలు” అని చెప్పారు. మరో వీక్షకురాలు సుప్రియ పురిటిపాటి “కోవిడ్ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపిస్తున్న కష్ట కాలంలో ఈ అంతర్జాల సమావేశం ద్వారా ప్రవాస తెలుగు పిల్లలను శ్లోక పాఠనాకార్యక్రమం కోసం ఒకచోటకు చేర్చినందుకు టాగ్స్ కు కృతజ్ఞతలు” అని చెప్పారు. టాగ్స్ పిలుపు కు స్పందించి అతి తక్కువ సమయంలో తమ శ్లోకాలు, కీర్తనలతో వినాయక చవితి పండుగకు మరింత శొభ తెచ్చారని టాగ్స్ అధ్యక్షులు నాగ్ దొండపాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలుగు విద్యార్ధులను ప్రశంసించారు. సహకారం అందించిన తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని టాగ్స్ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి టాగ్స్ సమన్వయ కర్త సత్యవీర్ సురభి విశేషంగా కృషి చేశారు. “కోవిడ్ గొడవ లేకుంటే టాగ్స్ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహంతో కోలాహలంగా వినాయక చవితి సంబరాలు శాక్రమెంటోలో జరిగిఉండేవని, వచ్చే ఏడు వినాయక కృప చేత కోవిడ్ మహమ్మారి నిర్మూలన పూర్తిగా జరిగి పూర్తి స్థాయిలో వినాయక చవితి సంబరాలు శాక్రమెంటోలో జరుగుతాయని ఆశిద్దాం” అని టాగ్స్ కోశాధికారి మోహన్ కాట్రగడ్డ ఆకాంక్షించారు .

“వినాయక చవితి శ్లోక పఠనం”, “పలికెద భాగవతం” కార్యక్రమాలను విజయవంతం చేసిన శాక్రమెంటో తెలుగు వారు అందరికీ పేరు పేరున, టాగ్స్ సమాచార అధికారి “రాఘవ్ చివుకుల” ధన్యవాదాలు తెలియజేశారు. టాగ్స్ ఆధ్వర్యంలో “పలికెద భాగవతం – రెండవ భాగం” కార్యక్రమం రూపకల్పనకు శ్రీ పార్థు నేమాని అంగీకరించారని, మరింత సమాచారం కోసం ఆసక్తి గల ప్రవాస తెలుగు విధ్యార్ధులు టాగ్స్ ను sactags@gmail.com ఈమెయిలు లో సంప్రదించాలని రాఘవ్ కోరారు. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. టాగ్స్ కార్యక్రమాల గూర్చి మరింత సమాచారం కోసం టాగ్స్ వెబ్ సైటు http://www.sactelugu.org/ ను లేదా టాగ్స్ ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/ ను సందర్శించాలని టాగ్స్ సమన్వయ కర్త సత్యవీర్ సురభి సూచించారు.