Politics

చీరాల వైకాపాలో వర్గపోరు

చీరాల వైకాపాలో వర్గపోరు

వైకాపాలో వర్గ పోరు వైఎస్‌ఆర్‌ వర్ధంతి వేదికగా మరోసారి బహిర్గతమైంది. ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌, కరణం బలరాం వర్గీయులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.ఫ్లెక్సీలు కూడా ఎవరికి వారే కట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద కార్యక్రమానికి ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు ఉదయం సమయమిచ్చారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయులకు అవకాశమిచ్చారు. తొలుత విగ్రహానికి ఏఎంసీ ఛైర్మన్‌, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వేణుగోపాల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇటీవల కడప జిల్లాలో వైకాపా వర్గపోరు ఉద్రిక్తతతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసే విషయంలో వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామ సచివాలయ శంకుస్థాపనకు రాగా.. ఒక వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రామకృష్ణారెడ్డి, డి. యోగానంద్‌ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. నడిరోడ్డుపైనే ఒకరినొకరు తోసుకున్నారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుచొచ్చారు.