NRI-NRT

అర్వింగ్‌లోని భారతీయులకు జాత్యాహంకార ఉత్తరం

అర్వింగ్‌లోని భారతీయులకు జాత్యాహంకార ఉత్తరం

టెక్సాస్ రాష్ట్రంలో భారతీయులు, తెలుగువారు అధికంగా నివసించే అర్వింగ్ ప్రాంతంలో జాత్యాహంకార ఉత్తరం కలవరాన్ని సృష్టిస్తోంది. డల్లాస్ పరిసర ప్రాంతం అయిన అర్వింగ్ నగరంలోని రాంచ్‌వ్యూ డ్రైవ్‌లోని ఓ భారతీయ కుటుంబానికి బెదిరింపు లేఖ వచ్చింది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలను భారతీయులు, చైనీయులు అమెరికన్ల నుండి దోచుకుంటున్నారని, వీరంతా తమ తమ స్వదేశాలకు తిరిగి వెళ్లకపోతే కాల్చివేస్తామని అందులో పేర్కొన్నారు. క్రీడాప్రాంతాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి చోట మీపై దాడికి తెగబడతామంటూ ఈ లేఖలో బెదిరించారు.

*** లేఖ వ్రాసింది భారతీయులేనా?
అర్వింగ్ భారతీయులకు అందిన ఈ ఉత్తరాన్ని అంతర్జాలంలో పరిశీలించిన పలువురు ఇది ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని అంటున్నారు. ఆంగ్లం మాతృకగా కలిగిన వారు “Return To…” అని గానీ “Go Back…” అని గానీ వ్రాస్తారని, కానీ ఈ లేఖలో “Return Back…” అనే ఆంగ్ల పదప్రయోగం చూస్తే ఇది ఎవరో ఆంగ్లం మాతృకగా లేనివారి పనిగా అవగతమవుతోందని నెటిజెన్లు తీర్మానిస్తున్నారు. అంతే గాక “…at Pools” బదులు “…on Pools” అని రాయడం కూడా అనుమానస్పదంగా ఉందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇది నాణేనికి ఒక వైపు కాగా మరోవైపు ఒకవేళ లేఖ వ్రాసింది జాత్యాహంకారులు అయినా దర్య్పాతును తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి పదప్రయోగం చేసి ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అర్వింగ్ పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎవరి వద్దనైనా సమాచారం ఉంటే తమను సంప్రదించవల్సిందిగా కోరారు. ఒక దర్యాప్తు అధికారిని ఈ కేసుపై నియమించారు.