DailyDose

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు?-తాజావార్తలు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు?-తాజావార్తలు

* టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సీనియర్ నేత అచ్చెన్నాయుడిని నియమించే అవకాశం ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని పలువురు నేతలు అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సమాచారం. మరో వారం, పది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ.. ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.

* జిల్లాల పాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ల బాధ్యతల్లో మరోమారు స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

* కొండపల్లి అడవులను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్​ను ఎంపీ కేశినేని నాని కోరారు. ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు పొందిన ప్రాచీన కళ కొండపల్లి బొమ్మల తయారీ అని గుర్తుచేశారు.

* ప్రజా పథకాలకు నగదు బదిలీ తప్పనిసరి చేస్తూ కేంద్రం సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంలో ఏపీలో ఉచిత విద్యుత్ పథకానికి కూడా నగదు బదిలీ వర్తింపచేయనున్నారు. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో ఈ నగదు బదిలీ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రస్తుతం తీసుకువస్తున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ పూర్తి ఉచితమేనని స్పష్టం చేశారు.

* నిధుల వినియోగంపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని తితిదే ధర్మకర్తల మండలి ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గత నెల 27 జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. ఇకపై ప్రతిఏటా నిధుల వినియోగంపై కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేసేలా తీర్మానం చేసింది. 2014-15 నుంచి 2019-20 మధ్య నిధుల వినియోగంపై రీ ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. గతంలో ఆడిట్ ప్రక్రియను అంతర్గతంగా నిర్వహించేవారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత కాగ్‌ ఆడిట్‌ ప్రక్రియ ప్రారంభించనుంది.

* సరిహద్దుల్లో దుస్సాహసాలకు పాల్పడుతున్న డ్రాగన్‌ను దెబ్బకొట్టేలా పబ్జీ సహా 118 యాప్‌లను భారత్‌ నిషేధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. భారత్‌ చర్యలు చైనా పెట్టుబడిదారులు, సర్వీస్‌ ప్రొవైడర్ల న్యాయపరమైన ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు చైనా వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావో ఫెంగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ తప్పును భారత్‌ సరిచేసుకోవాలని చైనా కోరుకుంటోందని తెలిపారు.

* కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని చెప్పారు.

* త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు శాసనసభ, మండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లు పాల్గొన్నారు. సమావేశాల నిర్వహణ, ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. సభలో ప్రభుత్వం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.

* విజయవాడ స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాదం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొవిడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తుండగా ఆగస్టు 9న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. దీంతో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ రమేశ్‌ బాబు, ఛైర్మన్‌ సీతారామ్మోహన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణ అంత సులభమేమీ కాదని అనిపిస్తోంది. అందరూ బయో బుడగ ఛత్రంలోనే ఉంటున్నా ఏదో ఒక విధంగా కరోనా వైరస్‌ కాటేస్తోంది. ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్‌ బృందంలో ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం 13 మంది దానికి బాధితులు అయ్యారు. యూఏఈలో ఐపీఎల్‌ నిర్వహణ కోసం వచ్చిన బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా కొవిడ్‌-19 బారిన పడ్డారని తెలిసింది.

* చరిత్రలో ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు. యుద్ధాల్లో చక్రవర్తులు ఆస్తులు కోల్పోయారు. అలాగే బ్రిటన్‌ దేశంలో ప్రజలు వారి జీవితంలో పదకొండు రోజులను కోల్పోయారట. ఆ విషయం మీకు తెలుసా? రోజులు కోల్పోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే.. అనుకుంటున్నారా? నిజంగా ఇది వింతే. అయితే దీనికి కారణం మాత్రం అప్పటి బ్రిటన్‌ ప్రభుత్వమే!

* ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టినవేసిన కరోనావైరస్‌ మహమ్మారికి చైనా కారణమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ కారణంతో దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయాన్ని అదనుగా భావించిన చైనా మాత్రం పలు దేశాలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ, భారత్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇందులో భాగమేనని అమెరికా అభిప్రాయపడింది.

* కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్లైవుడ్‌ కంపెనీలో ఖాళీ కెమికల్‌ డబ్బాలు పేలడంతో ఇద్దరు మృతిచెందారు. జయరాజ్‌ ప్లైవుడ్‌ కంపెనీలో ఈ ఘటన జరిగింది. తుక్కు కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు తమ ఆటోలోకి ఖాళీ కెమికల్‌ డబ్బాలను ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

* టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అత్యుత్తమ ఫాస్ట్‌బౌలరన్న విషయం అందరికీ తెలిసిందే. అతడు బంతితో మాయ చేసి ప్రత్యర్థుల వికెట్లు అవలీలగా తీసేయగలడు. పదునైన స్వింగర్లతో బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించగలడు. అలాంటి పేసర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 14 సిక్సర్లు బాదాడంటే నమ్మగలమా? అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశంతో. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అతడే ఈ మాటలు చెప్పాడు.