Devotional

గుడిలో గంట కొట్టాల్సిందేనా?

గుడిలో గంట కొట్టాల్సిందేనా?

సాధారణంగా అన్ని దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వేలాడుతూ కనిపిస్తాయి. భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టగానే గంట మోగించి ఆ తరవాతే దేవుడి దర్శనానికి ఉపక్రమిస్తారు. అయితే గుడిలో ‘గంట ఎందుకు మోగిస్తాం’ అనే విషయం చాలామందికి తెలియదు. గంటను మోగించినప్పుడు అది విశ్వానికి భగవన్నామం అయిన ఓంకార నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. అలా వెలువడే శబ్దాన్ని మంగళకరమైన ధ్వనిగా పరిగణిస్తారు. ఆ ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయనీ, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ప్రసాదిస్తాయనీ పురాణాలు చెబుతున్నాయి. అలానే ప్రత్యేక మిశ్రమ లోహాలతో తయారు చేసిన గంటను మోగించినప్పుడు దాదాపు ఏడు సెకన్ల పాటు మన మెదడులోనూ ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుందట. ఆ శబ్దం సకల సుషుప్తావస్థలనూ పటాపంచలు చేసి భక్తుల దృష్టిని భగవంతుడి మీదకు మళ్లిస్తుందని ఓ విశ్వాసం. అంటే భక్తి పారవశ్యత, అంతరంగ శాంతి, ఏకాగ్రతలకు భంగం కలిగించే అమంగళకరమైన అసంబద్ధమైన శబ్దాలూ, వ్యాఖ్యానాలూ భక్తుల చెవులకూ తద్వారా మనసుకూ చేరకుండా ఈ నాదం సహాయపడుతుంది. స్కూళ్లలోనూ పీరియడ్‌కీ పీరియడ్‌కీ మధ్య గంట కొట్టడంలో ఆంతర్యం కూడా విద్యార్థులు అప్పటివరకూ ఉన్న స్థితి నుంచి బయటకొచ్చి ఆ తరవాత అంశాల మీద దృష్టిపెట్టడం కోసమే అంటారు పెద్దలు.