DailyDose

నా జోలికి వస్తే చేతల్లో చూపుతా-తాజావార్తలు

నా జోలికి వస్తే చేతల్లో చూపుతా-తాజావార్తలు

* ఏపీ మంత్రి కొడాలి నాని, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటలయుద్ధం జరిగింది. మీడియా సమావేశంలో వేర్వేరుగా ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తొలుత వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని..దేవినేనిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. తనజోలికి వస్తే మాటల్లో కాకుండా చేతల్లో చూపుతానంటూ దేవినేని ఉమను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

* విమానాశ్రయంలో డొమెస్టిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనుల కోసం సినీ ప్రముఖుల భూములను అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి ఎయిర్‌పోర్టు అధికార యంత్రాంగం నివేదించింది. సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వినీదత్‌లకు సంబంధించిన సుమారు 70 ఎకరాల భూములను తమకు అప్పగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు లేఖ రాసినట్టు తెలిసింది. ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం జిల్లా యంత్రాంగం కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, దావాజీగూడెం, అల్లాపురం, చిన అవుటపల్లి గ్రామాలకు చెందిన 700 ఎకరాల భూములను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అప్పగించింది. ఈ భూముల్లో ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను దశలవారీగా చేపట్టాల్సి ఉంది. కేసరపల్లిలో ఉన్న భూముల్లో నటుడు కృష్ణంరాజుకు చెందిన 30 ఎకరాలు, నిర్మాత అశ్వినీదత్‌కు చెందిన 39 ఎకరాలు ఉన్నాయి. వీరు ఎయిర్‌పోర్టు విస్తరణకు  సంబంధించి భూసమీకరణలో భాగంగా అమరావతి ప్యాకేజీకి అంగీకరిస్తూ అంగీకార పత్రాలను అందించారు. జిల్లా యంత్రాంగం ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించిన భూములను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకునే క్రమంలో కొద్దికాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

* ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ వ్యవహారంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి సహా తొమ్మిది మందికి ఈ నెల 18 వరకు రిమాండ్‌ విధించింది. కె. పద్మ, వసంత ఇందిరా, శ్రీహరి బాబుతో పాటు మరికొందరికి రిమాండ్‌ విధించగా.. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు స్వాహా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 59,919 నమూనాలను పరీక్షించగా 10,776 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 76 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,65,694 నమూనాలను పరీక్షించారు. తాజా లెక్కలతో కలిపి 1,02,067 కరోనా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 85వేల ఇళ్లు పేదలకు అందజేయనున్నామని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. దీనికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రకియను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020లో తాను భాగమవ్వడం లేదని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబంతోనే ఉండాలని భావిస్తున్నానని భజ్జీ అన్నాడు. తన నిర్ణయాన్ని చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యానికి తెలియజేశానన్నాడు. వారెంతో మద్దతుగా నిలిచారని వెల్లడించాడు. టోర్నీలో జట్టు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్‌ చేశాడు.