Business

ఇక గూగుల్ ఉద్యోగులకు శుక్రవారం కూడా సెలవు-వాణిజ్యం

ఇక గూగుల్ ఉద్యోగులకు శుక్రవారం కూడా సెలవు-వాణిజ్యం

* వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు మరొక రోజును వీక్‌ ఆఫ్‌గా గూగుల్‌ ప్రకటించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు గూగుల్‌ అవకాశం కల్పించినట్లు ఓ నివేదిక పేర్కొంది. శుక్రవారం రోజును సంస్థలోని శాశ్వత, శిక్షణ పొందుతున్న తాత్కాలిక సిబ్బందికి వీక్‌ఆఫ్‌గా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఆ రోజు ఎవరైతే పని చేస్తారో వారు మరొక రోజును సెలవుగా తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. డే ఆఫ్‌ను కల్పించడంలో మేనేజర్లు తమ బృందం సభ్యులకు మద్దతుగా నిలవాలని కంపెనీ సూచించింది. గూగుల్‌ నిర్ణయంతో ఇతర సంస్థల ఉద్యోగులు కూడా తమకు అలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతుండటం గమనార్హం.

* సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకొంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు తమ జోరు కొనసాగించాయి. ఏపీ వరుసగా రెండోసారి తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి చేరింది. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ఆక్రమించింది. గతంలో 12 స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందుంది. 2019 మార్చి 31వరకు రాష్ట్రాలు అమలుచేసిన సంస్కరణలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని మదించి ర్యాంకులు విడుదల చేసింది.

* ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా కొత్తగా ‘మేకిన్‌ ఇండియా (ఎంఐఐ) బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌’ను ఏర్పాటు చేసినట్లు భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) శుక్రవారం తెలిపింది. ఆసక్తి ఉన్న గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ‘భెల్‌’ సౌకర్యాలను వాడుకునేందుకు వీలుగా దీన్ని నెలకొల్పినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

* టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ మోడల్‌ హ్యారియర్‌లో కొత్త వేరియంట్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని పరిచయ ధరగా రూ.16.99 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. టాటా హ్యారియర్‌ ఎక్స్‌టీ+ వేరియంట్‌లో పనరోమిక్‌ సన్‌రూఫ్‌, ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, 17 అంగుళాల అలాయ్‌ చక్రాలు వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబరులో ఈ కారును బుక్‌ చేసుకుని, డిసెంబరు 31లోపు డెలివరీ తీసుకునే వినియోగదారులకు మాత్రమే పరిచయ ధర లభిస్తుందని టాటా మోటార్స్‌ తెలిపింది.