DailyDose

రుణాలు తీసుకోమని ప్రోత్సహిస్తున్న చిదంబరం-వాణిజ్యం

రుణాలు తీసుకోమని ప్రోత్సహిస్తున్న చిదంబరం-వాణిజ్యం

* జూన్‌ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 23.9శాతం మేర కుచించుకుపోవడంపై ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆత్మసంతృప్తి నుంచి బయటకు వచ్చి అర్థవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టాలని హితవుపలికారు. ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా, వివేకంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌తో అత్యధికంగా ప్రభావితమైన అమెరికాలో వృద్ధి రేటు 12.4 శాతం, ఇటలీలో 9.5 శాతం కుంగిపోయిందని గుర్తుచేశారు. వీటితో పోలిస్తే భారత్‌ స్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన లింక్‌డ్‌ ఇన్‌ పేజీలో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.43 సమయంలో సెన్సెక్స్‌ 210 పాయింట్లు నష్టపోయి 38,146 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11,276 వద్ద కొనసాగుతున్నాయి. వొడాఫోన్‌ ఐడియా, రెప్కో హోం ఫైనాన్స్‌, ఎన్‌ఎల్‌సీ ఇండియా, డిష్‌ టీవీ ఇండియా, సబ్ధావ్‌ ఇంజినీరింగ్‌ షేర్లు లాభపడుతుండగా.. జుబ్లియంట్‌ లైఫ్‌ సైన్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఫ్యూచర్‌ రీటైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ షేర్లు కుంగాయి.

* వివిధ ఉత్పత్తులు, సేవలు అందించే సంస్థలు ఇచ్చే ప్రకటనలకు (అడ్వర్టైజింగ్‌) సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలతో ముసాయిదాను రూపొందించింది. ఈమేరకు ప్రకటనల్లో సాధారణ వినియోగదారులకు చదువుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి సులువుగా లేని అస్పష్టమైన ‘డిస్‌క్లైమర్లు’ (తమకు బాధ్యత/సంబంధం లేదని ప్రకటించడం) ఉంటే వాటిని తప్పుతోవ పట్టించే ప్రకటనలుగా పరిగణిస్తారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిపై ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ చర్యలు చేపడుతుంది. ఈ ముసాయిదాను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రజాభిప్రాయ సేకరణకు ఉంచింది. ఈనెల 18లోగా అభిప్రాయాలు తెలపాలని కోరింది. ఈ మార్గదర్శకాలు తమ వస్తువులు లేదా సేవలపై ప్రకటనలు ఇచ్చే కంపెనీలకు, ప్రకటనల ఏజెన్సీలకు వర్తిస్తాయి. ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ‘డిస్‌క్లైమర్‌’ స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. దృష్టి(చూపు) సాధారణంగా ఉన్నవారికి స్పష్టంగా కనిపించాలి. సముచితమైన దూరం నుంచి సముచితమైన వేగంతో చదువుకోగలిగేలా సమాచారం ఉండాలి. ప్రకటనలు ఏ భాషలో ఉంటే ఇవీ అదే భాషలో ఉండాలి. అదే ఫాంటులో అక్షరాలుండాలి. ప్రకటన ఒకవేళ వాయిస్‌ ఓవర్‌ రూపంలో ఉంటే డిస్‌క్లెయిమర్‌ కూడా అదే స్థాయి స్వరంలో ఉండాలి. డిస్‌క్లెయిమర్‌లో సంబంధిత వస్తు సమాచారం ఏదీ దాచే ప్రయత్నం చేయరాదు. తప్పుతోవ పట్టించేదిగా ఉండకూడదు.

* దేశ ఆర్థిక వ్యవస్థను పునరద్ధరించాలంటే ప్రజల వినిమయ శక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. అందుకోసం ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ట్విటర్‌ వేదికగా ప్రభుత్వానికి తెలియజేశారు.

* బలహీన అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెప్టెంబరు 1 నుంచి సెబీ కొత్త మార్జిన్‌ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మార్కెట్లలో నగదు లభ్యతపై ఇది ప్రతికూల ప్రభావం చూపొచ్చన్న అంచనాలతో మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. జీడీపీ 23.9 శాతం క్షీణించడం, వరుసగా అయిదో నెలా కీలక రంగాలు కుదేలవ్వడం, కొవిడ్‌-19 కేసుల విజృంభణ ఇందుకు తోడయ్యాయి. అయితే ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో టెలికాం సంస్థలకు ఊరట లభించడం, వాహన విక్రయాలు అంచనాలకు మించి నమోదుకావడం వల్ల కొంత ఉపశమనం దక్కింది. అన్‌లాక్‌-4 నిబంధనలు, ఆగస్టు సేవల పీఎంఐ మెరుగుపడటం కలిసొచ్చింది. త్రైమాసిక ఫలితాలు, ఏజీఎంల నుంచి వచ్చిన వార్తల నేపథ్యంలో రంగం/షేరు ఆధారిత కదలికలు కొనసాగాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.1 శాతం పెరిగి 43 డాలర్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.1 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.8 శాతం నష్టంతో 38,357 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.7 శాతం తగ్గి 11,334 పాయింట్ల దగ్గర స్థిరపడింది. బ్యాంకింగ్‌, స్థిరాస్తి, చమురు- గ్యాస్‌ షేర్లు నీరసపడ్డాయి. ఐటీ, మన్నికైన వినిమయ వస్తువులు, వాహన స్క్రిప్‌లు పరుగులు తీశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.3780 కోట్ల షేర్లను, డీఐఐలు, ఫండ్లు రూ.1089 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

* భారతీ ఎయిర్‌టెల్‌ అన్‌లిమిటెడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రారంభించింది. నెలకు రూ. 499 ప్రారంభ ధరతో లభ్యమయ్యే ఈ ప్లాన్లలో వీడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌, తిరిగి చెల్లించే డిపాజిట్‌(రూ.1500)తో హెచ్‌డీ సెట్‌-టాప్‌ బాక్సును అందిస్తోంది. పోటీ సంస్థ రిలయన్స్‌ జియో అన్‌లిమిటెడ్‌ డేటాతో మార్పులుచేసి బ్రాడ్‌బ్యాండ్‌ పథకాలను తీసుకొచ్చిన వారంలోనే ఎయిర్‌టెల్‌ కూడా ముందుకురావడం గమనార్హం. ఈ కొత్త ప్లాన్లు దేశవ్యాప్తంగా 125 నగరాల్లో ఈనెల 7 నుంచి అందుబాటులోకి వస్తాయని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.499 ప్లాన్‌లో 40 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ అందిస్తామని, రూ.799, రూ.999, రూ.1,499 ప్లాన్లలో 3,500 జీబీ వరకు నిర్దిష్ట వేగంతో అందించనున్నట్లు పేర్కొంది. ‘‘అన్ని ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్లు కూడా ఏ టీవీనైనా స్మార్ట్‌ టీవీగా మార్చే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ (రూ.3,999 విలువైనది)తో కలిసి ఉంటాయి. వినియోగదారులు 550 టీవీ ఛానెళ్లు, 10,000 సినిమాలు, షోలు చూడవచ్ఛు అన్ని కొత్త ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్‌ ఫోన్‌కాల్స్‌ చేసుకోవచ్ఛు’’ అని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కొంత సానుకూల వృద్ధి సాధ్యమే!