DailyDose

ఎస్పీబీ కరోనా నయం అయింది-TNI బులెటిన్

ఎస్పీబీ కరోనా నయం అయింది-TNI బులెటిన్

* గాయకుడు ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్. ​ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్​గా తేలింది. కొద్ది రోజులుగా  ఆయన చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

* దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తృతి పెరుగుతూనే ఉంది. నిత్యం 90వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42లక్షలు దాటింది. దేశంలో ఆగస్టు 7 నాటికి 20లక్షల మార్కును దాటగా, ఆగస్టు 23 తేదీకి ఈ సంఖ్య 30లక్షలకు చేరింది. ఇక సెప్టెంబర్‌ 5తేదీ వరకు మొత్తం కేసుల సంఖ్య 40లక్షలకు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు మొత్తం 9లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కేసులు ఎక్కువగా కేవలం ఐదురాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర(21.6%), ఆంధ్రప్రదేశ్‌(11.8%), తమిళనాడు(11.0%), కర్ణాటక(9.5%), ఉత్తర్‌ప్రదేశ్‌(6.3%)రాష్ట్రాల్లోనే అధిక కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 60శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా సోకిన వారిన సంఖ్య 5లక్షలు దాటింది. ఒక్కరోజు వ్యవధిలో 58,187 నమూనాలను పరీక్షించగా 8,368 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 5,06,493కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 70 మంది మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, గుంటూరు 9, చిత్తూరు 8, కడప 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, నెల్లూరు 5, అనంతపురం 4, కర్నూలు 4, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4,487కి చేరింది. మరోవైపు ఒక్కరోజులో 10,055 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,66,077 నమూనాలను పరీక్షించారు.

* చైనా సంస్థ సినోవాక్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఆ సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మీద పరీక్షించారు. అత్యవసర వినియోగ కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆ ఫార్మా సంస్థ సీఈఓ ఇన్‌ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాలు జరుపుకుంటున్న ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద కొన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అందజేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో వైద్య సిబ్బంది, ఆహార మార్కెట్లలో పనిచేసేవారు, రవాణా, సేవల విభాగంలో విధులు నిర్వహించే వారు ఉన్నారు.

* కరోనా మహమ్మారి నుంచి రక్షించే వ్యాక్సిన్‌ కోసం యావత్తు ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు టీకాలు తుది దశకు చేరుకోవడంతో ఆ ఆశలు రెట్టింపయ్యాయి. అయితే.. ప్రతి దేశపు అవసరాల్ని తీర్చే స్థాయిలో వ్యాక్సిన్‌ డోసులు ఎలా తయారు చేస్తారు? చేసిన వాటిని ఎలా పంపిణీ చేస్తారు? ముందు ఎవరికి ఇస్తారు? అన్న అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోతే.. పేద దేశాలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గురుతర బాధ్యతను యూనిసెఫ్‌ తన భుజాల మీదకు ఎత్తుకుంది. వ్యాక్సిన్‌ సేకరణ, పంపిణీ ప్రక్రియల్ని స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే అనేక వ్యాధులకు సంబంధించి ఏటా 2 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్లను ఈ సంస్థ కొనుగోలు చేస్తోంది. వీటిని దాదాపు 100 దేశాల్లో పిల్లలకు అందజేస్తోంది.