Devotional

బ్రహ్మను ఎందుకు పూజించరు?

బ్రహ్మను ఎందుకు పూజించరు?

ఈ సృష్టికే కారకుడు బ్రహ్మ అని హిందూ పురాణాలు చెబుతుంటాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవతలు త్రిమూర్తులు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు.. ఈ ముగ్గురిలో విష్ణు, మహేశ్వరులకు చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో పూజలు ఉన్నాయి. కానీ బ్రహ్మకు పూజలు ఉండవు. ఆలయాలు ఉండవు.. ఎందుకో చూద్దాం. ఒకనాడు బ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరిందట.
ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు అంచుని చేరుకోగలుగుతారో వారు గొప్పవారన్నదే ఆ పరీక్ష సారాంశము. ఆ పరీక్షకు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా సరేనన్నారు. పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆద్యంతరహితమైన ఒక లింగరూపంలో వెలిశాడు.

అంతట బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగుభాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు. ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనేలేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవడం ఏమిటన్న అహంకారం కలిగిందట బ్రహ్మదేవునిలో.
దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. అంతేకాదు! తన మాట నిజమేనంటూ ఒక మొగలిపూవు చేత కూడా సాక్ష్యం చెప్పించాడట. కానీ లయకారుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచేయాలని చూసినందుకు ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. శివుని మూడో కంటికి బ్రహ్మకు ఉన్న ఐదో తల భస్మమైపోయింది. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకడంతో, ఇకమీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోతాడంటూ శపించాడు శివుడు. అదీ సంగతి అందుకే బ్రహ్మకు ఆలయాలు అరుదు.