DailyDose

రైతులకు ప్రయోజనం అందించే కిసాన్ రైలు-తాజావార్తలు

రైతులకు ప్రయోజనం అందించే కిసాన్ రైలు-తాజావార్తలు

* ‘కిసాన్‌ రైలు’ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అయితే, కిసాన్‌ రైలు ఛార్జీల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఛార్జీలు తగ్గిస్తే మరింత ఉపయోగకరమని అన్నారు. అనంతపురం-దిల్లీ మధ్య ‘కిసాన్‌ రైలు’ సర్వీసును వీడియో లింక్‌ ద్వారా సీఎం జగన్‌, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నప్పటికీ.. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో రైతులు పండించే మొత్తం పంటలో.. రాష్ట్రమంతా కలిపి 10 నుంచి 15 శాతం వినియోగమే ఉంటుంది. దక్షిణ భారత్‌కు ఏపీ పండ్ల ఉత్పత్తి కేంద్రంగా ఉంది. అయితే కొవిడ్‌ సమయంలో రవాణా సౌకర్యం లేక మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కష్టంగా మారింది. ‘కిసాన్‌ రైలు’ లాంటి ప్రత్యామ్నాయాలు.. రైతులకు మరింత అండగా ఉండేలా, గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకునేందుకు ఉపకరిస్తాయి’’ అని సీఎం అభిప్రాయపడ్డారు.

* పెద్దపెద్ద రెస్టారెంట్ల మాదిరిగానే వీధి వ్యాపారుల కోసం ఆన్‌లైన్‌ వేదికను సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్బర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర లబ్ధిదారులతో వర్చువల్‌లో మోదీ ముచ్చటించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో లక్షలాదిమందికి పథకం ప్రయోజనాలను అందించినందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు.

* ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేయడంపై నటి కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూవీ మాఫియాతో జట్టుకట్టి తనపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. ‘ఉద్ధవ్‌ ఠాక్రే.. మీకేమనిపిస్తోంది? మూవీ మాఫియాతో కలిసిపోయారు. నా ఇంటిని కూల్చి నా మీద పగ తీర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు కదా? ఈ రోజు నా ఇంటిని కూల్చిశారు. రేపు మీ అహంకారం అలానే కూలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిత్యం పరిగెడుతూనే ఉంటుందనేది గుర్తుంచుకోండి’’ అని కంగన అన్నారు.

* వేతన జీవుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో 2019-20 సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ జమ చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. అయితే, తొలుత 8.15 శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతం డిసెంబర్‌లో చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయనున్నారు.

* రాజకీయాల్లో నేరచరిత్ర ఉన్న నాయకుల పాత్ర రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా వందల మంది నాయకులు నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. దేశంలో ప్రస్తుత చట్టసభ సభ్యులపైనే 2,556 పెండింగ్‌ కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టు తాజా నివేదిక వెల్లడించింది. గతంలో పనిచేసిన, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై 4,442 నేరపూరిత కేసులు పెండింగులో ఉన్నట్లు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నాయి.

* బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. నటి ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్నేహితుడు దేవరాజు రెడ్డి వెల్లడించారు. కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశంలో దేవరాజు రెడ్డి వెల్లడించారు. శ్రావణిని హింసించి కొట్టడంతో అవమానం, బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

* నేత్రదాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సక్షమ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. నేత్రదానాన్ని శ్రేష్ఠమైన దానంగా అభివర్ణించిన ఆయన.. సమాజానికి మనమిచ్చే అత్యున్నత కానుకల్లో నేత్రదానం ఒకటన్నారు. నేత్రదానం చేసేవారి సంఖ్య దేశంలో తక్కువగా ఉందని గుర్తు చేశారు.