Food

ఇంట్లో కషాయాలతో అనారోగ్యాలు

ఇంట్లో తయారు చేసుకున్న కషాయాలతో ఇమ్యూనిటీ పెరగడం సంగతేమో గాని ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అనేక మంది వివిధ రకాల ఇమ్యూనిటీ బూస్టర్లను వాడుతున్నారు. కొంతమంది మార్కెట్లో రెడీమేడ్‌గా తయారు చేసిన పౌడర్లు వాడుతుండగా.. మరికొందరు ఇంట్లోని వంటగదిలో లభించే లవంగాలు, మిరియాలు, దాల్చిని, శొంఠి, తిప్పతీగతో కషాయాలు చేçసుకుంటున్నారు. వేడినీటిని కూడా ఎక్కువగా తాగేస్తున్నారు. నిజానికి ఈ కషాయాలు, వేడినీళ్లు ఆరోగ్యానికి మంచివే. ఓ పరిమితి వరకు ఎలాంటి నష్టాలు ఉండవు. కానీ.. వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవాలనే ఆలోచనతో కొంత మంది మోతాదుకు మించి వీటిని వాడుతున్నారు. వైరస్‌ నుంచి బయటపడటమేమో గాని.. తీవ్రమైన గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి జీర్ణకోశ సంబంధ సమస్యల బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే ఈ తరహా సమస్యలు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ మధుసూదన్‌ అభిప్రాయపడ్డారు.