Agriculture

₹1.12కోట్లను లంచం అడిగి పట్టుబడిన మెదక్ అదనపు కలెక్టర్

అవినీతి నిరోధకశాఖ అధికారులకు మరో భారీ తిమింగలం దొరికింది. మెదక్‌ అదనపు పాలనాధికారి నగేష్‌ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌ మండలం మాచవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచే సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించి ఎన్‌వోసి ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు పాలనాధికారి నగేష్‌ను సంప్రదించారు. అయితే, పాలనాధికారి ఎన్‌వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న అదనపు కలెక్టర్‌ మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ అయిన జీవన్‌గౌడ్‌ పేరుమీద అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. ఈనేపథ్యంలో రైతు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు మాట్లాడిన ఆడియో క్లిప్‌లతో సహా ఇతర ఆధారాలను అవినీతి నిరోధకశాఖ అధికారులకు సమర్పించాడు. దీంతో వారం రోజులుగా దీనిపై పూర్తి వివరాలు సేకరించిన అధికారులు అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఆర్డీవో అరుణరెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాచవరంలోని నగేష్ అధికారిక నివాసంతో పాటు కొంపల్లిలోని ఆయన స్వగృహంలో, బోయిన్‌పల్లిలోని జీవన్‌గౌడ్‌ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నగేష్‌ ఇంట్లో తనిఖీల్లో రూ.లక్ష నగదు, భూమికి సంబంధించిన కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరికొందరు రెవెన్యూ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలతో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసు మర్చిపోకముందే అంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు రావడం రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.