Movies

జైలులో రియా

జైలులో రియా

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తిని పోలీసులు జైలుకు మార్చారు. ఈ కేసులో డ్రగ్స్‌ కోణంపై ఆమెను మూడు రోజుల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం రియాను నిన్న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ (ఈ నెల 22వరకు)కి అనుమతించింది. దీంతో రాత్రంతా ఆమె ఎన్‌సీబీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ ఉదయం రియాను బైకుల్లా మహిళా జైలుకు అధికారులు తరలించారు. షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా, భీమా కోరెగాన్‌ కేసులో అరెస్టయిన ఉద్యమకారిణి సుధా భదరద్వాజ్‌ వంటి వారు ఈ జైలులోనే ఉన్నారు. తన స్నేహితుడు సుశాంత్‌ కోసం ఆమె మాదకద్రవ్యాలను తీసుకొచ్చేదని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న అధికారులు.. రియా డ్రగ్స్‌ వాడకంపై ఎటువంటి ప్రస్తావనా చేయలేదు. శామ్యూల్‌ మిరండా, దీపేశ్‌ సావంత్‌ మాత్రం సుశాంత్‌ కోసం తాము డ్రగ్స్‌ తీసుకొచ్చేవాళ్లమని, రియా డబ్బులిచ్చేదని పేర్కొన్నట్టు సమాచారం. తాజాగా ముంబయి కోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ముంబయి సెషన్స్‌ కోర్టు రేపు విచారించనుంది.