Business

“టెస్లా” మస్క్ సంపద ఆవిరి-వాణిజ్యం

“టెస్లా” మస్క్ సంపద ఎగిరిపోయింది-వాణిజ్యం

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయంపై ఆర్‌ఐఎల్‌ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.7,500 కోట్లు. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్‌లో సిల్వర్‌ లేక్‌కు 1.75 శాతం వాటా దక్కనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ మానిటైజేషన్‌ తర్వాత ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించింది. దాదాపు 10 శాతం వాటాల్ని విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వివిధ పెట్టుబడి సంస్థలను సంప్రదించినట్లు ఇటీవల జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సదస్సులో ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలను రిటైల్‌లోనూ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.

* ప్రముఖ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి సంస్థ టెస్లా షేర్ల విలువ భారీగా పడిపోయింది. న్యూయార్క్‌ ట్రేడింగ్‌లో మంగళవారం టెస్లా సంస్థ షేర్ల విలువ ఏకంగా 21 శాతానికి పైగా తగ్గింది. దీంతో కంపెనీ విలువ సుమారు 82 బిలియన్‌ డాలర్లు తగ్గి.. 307.7 బిలియన్‌ డాలర్లను చేరుకుంది. టెస్లాకు ఎస్‌అండ్పీ -500 ఇండెక్స్‌ జాబితాలో చోటు దక్కకపోవడంతో మదుపరులు సంస్థ షేర్లను భారీగా విక్రయించారు.

* అసలే అంతంత మాత్రంగా ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌-19 వ్యాప్తి మరింత కుంగదీసింది. బ్యాంకింగ్‌ రంగంపై దీని ప్రభావాన్ని విశ్లేషించేందుకు సీనియర్‌ బ్యాంకింగ్‌ నిపుణుడు కేవీ కామత్‌ నేతృత్వంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ కీలక విషయాలను వెల్లడించింది. దేశంలో అత్యుత్తమ కంపెనీలను, వ్యాపారాలను కూడా కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బ తీసిందని ఈ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఇక బ్యాంకింగ్‌ రంగంలోని 70 శాతం రుణాలపై కరోనా ప్రభావం పడిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాల పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకునేముందు.. బ్యాంకులు కరెంట్‌ రేషియో తదితర ఐదు కీలక అంశాలపై దృష్టి సారించాలని సూచించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 148 పాయింట్లు పతనమై 38,217 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 11,271 వద్ద కొనసాగుతున్నాయి. ఇప్కా ల్యాబొరేటరీస్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, అంబీర్‌ ఎంటర్‌ ప్రైజస్‌, ఎంసీఎక్స్‌, పీవీఆర్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఆస్ట్రాజెనికా, సబ్ద్వ ఇంజినీరింగ్‌, డిష్‌మన్‌, లెమన్‌ ట్రీ, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లోని అన్ని రంగాల సూచీలు కుంగాయి.

* ఫోర్బ్స్‌ అమెరికా శ్రీమంతుల జాబితాలో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోని అత్యంత ధనవంతులైన 400 మందితో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్‌ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్‌ రమేశ్‌ వాద్వాని, వేఫెయిర్‌ సహవ్యవస్థాఫకుడు, సీఈఓ నీరజ్‌ శా, కోశ్లా వెంచర్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, వర్క్‌డే సీఈఓ అనిల్‌ భూశ్రీ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికాలో అత్యంత శ్రీమంతుడిగా అమెజాన్‌ అధిపతి జఫె్‌ బెజోస్‌ వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానాన్ని సంపాదించారు. ఈయన నికర సంపద 179 బిలియన్‌ డాలర్లు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 111 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ (85 బిలియన్‌ డాలర్లు) మూడో స్థానంలోను, బెర్క్‌షైర్‌ హాథ్‌వే సీఈఓ వారెన్‌ బఫెట్‌ (73.5 బిలియన్‌ డాలర్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఒరాకిల్‌ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ 72 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ఐదో ర్యాంకు పొందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 339వ స్థానంలో నిలిచారు. ఈయన నికర సంపద 2.5 బిలియన్‌ డాలర్లు. భారత సంతతికి చెందిన జై చౌదరీ 85వ స్థానం (6.9 బిలియన్‌ డాలర్లు), రమేశ్‌ వాద్వాని 238వ స్థానం (3.4 బి.డాలర్లు), నీరజ్‌ శా 299వ స్థానం (2.8 బి.డాలర్లు), వినోద్‌ కోశ్లా 353వ స్థానం (2.4 బి.డాలర్లు), కవిటర్క్‌ రామ్‌ శ్రీరామ్‌, రాకేశ్‌ గాంగ్వాల్‌, అనిల్‌ భూశ్రీ 359వ స్థానం (2.3 బి.డాలర్లు) పొందారు.

* ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం కేసుపై మంగళవారం ముంబయిలోని పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్‌ నిరోధక చట్టం) కోర్టులో విచారణ సాగింది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ను ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆయన విచారణకు సహకరించడం లేదని కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్ సింగ్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో వాదనలు విన్న అనంతరం సెప్టెంబర్ 19 వరకు దీపక్‌ కొచ్చర్‌కు రిమాండ్‌ విధిస్తూ ఈడీ కస్టడీకి తరలించేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారిపై సమర్థంగా పనిచేయగలదన్న ఆశాభావంతో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలను ఆస్ట్రాజెనెకా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు సైతం నష్టపోయాయి. అయితే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌ వంటి భారీ షేర్లు రాణించడం భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి.

* జపాన్‌ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో కుంగింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా 28.1 శాతం క్షీణించినట్లు మంగళవారం జపాన్‌ ప్రభుత్వం వెల్లడించిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో అంచనా -27.8 శాతమే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక క్షీణత ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే జపాన్‌ మాంద్యంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.