Health

ఏపీ ప్రజలకు కరోనా వచ్చి పోయిందనే సంగతే తెలియదు

ఏపీ ప్రజలకు కరోనా వచ్చి పోయిందనే సంగతే తెలియదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. పాజిటివ్ కేసులతో పాటు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య కూడా భారీగా ఉంది.. ఇక, ఏపీలో కరోనా వ్యాప్తిపై సీరో సర్వైలెన్స్‌ సర్వే నిర్వహించింది.. ఇవాళ సీరో సర్వైలెన్స్‌ సర్వే ఫలితాలను వెల్లడించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి… రాష్ట్రంలో 19.7 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారించారు. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్టు నిర్ధారించగా.. మహిళల్లో అయితే 19.9 శాతంగా ఉంది. ఇక, పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా వచ్చిపోగా.. గ్రామీణ ప్రాంతాల్లో అది 18.2 శాతంగా ఉందని వెల్లడించారు.  ఇక, కంటైన్‌మెంట్ జోన్ల విషయానికి వస్తే.. 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్టుగా నిర్ధారించింది సీరో సర్వైలెన్స్‌ సర్వే.. నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో అది 19.3 శాతంగా ఉంది.. మరోవైపు.. రాష్ట్రంలో కరోనా వచ్చిపోయినవారిలో 20.3 శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్టుగా సర్వే పేర్కొంది.. ఈ సర్వేపై స్పందించిన ఏపీ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ కమిషనర్ భాస్కర్… కోవిడ్ వ్యాప్తిపై సిరో సర్వేలెన్సు అంచనాలు తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 19.7 శాతం మందికి కోవిడ్ వచ్చి తగ్గిపోయిందని.. కోవిడ్ వచ్చినట్లు కూడా వారికి తెలియదన్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకున్నాం.. 45 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరించామని.. ఏ లక్షణాలు లేని వారి నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నామని చెప్పుకొచ్చారు. మొత్తంగా సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. 20.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినా… ఆ విషయం వారికే తెలియకపోవడం ఆసక్తికరంగా మారింది.