DailyDose

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు-తాజావార్తలు

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు-తాజావార్తలు

* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయ అధికారులు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

* అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీకి పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్‌ సింగ్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌యాదవ్‌కు ఒక పేజీ లేఖను పంపారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న రఘువంశ్‌ ప్రసాద్‌ దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే రఘువంశ్‌ ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ‘‘ప్రజానేత కర్పూరి ఠాకూర్‌ మరణానంతరం నేను 32 ఏళ్ల పాటు మీ వెనకే ఉన్నాను. కానీ ఇప్పుడు కాదు.. దయచేసి నన్ను క్షమించండి’’ అని లేఖలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

* చైనాకు చెందిన దాదాపు వెయ్యిమందికిపైగా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా రద్దుచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా చైనా స్పందించింది. చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేయడం రాజకీయ కక్షతోపాటు జాతి వివక్ష చూపించడమేనని ఆరోపించింది. దీనిపై ప్రతి స్పందించే హక్కు చైనాకు ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ స్పష్టం చేశారు. వివిధ కారణాలతో చైనా విద్యార్థులపై చర్యలు తీసుకుంటూ, అమెరికాలో వారిని అణచివేతకు గురిచేయడాన్ని వెంటనే ఆపాలని అన్నారు. ఈ చర్యలు చైనా విద్యార్థుల మానవ హక్కులను కాలరాయడమేనని ఝావో లిజియన్‌ పేర్కొన్నారు.

* అయోధ్యలో రామమందిర నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు లక్షలాది రూపాయల మేరకు మోసానికి గురైంది. గుర్తుతెలియని మోసగాళ్లు నకిలీ చెక్కులతో ట్రస్టు ఖాతా నుంచి రూ.6,00,000 డబ్బును స్వాహా చేశారు. అయోధ్య పోలీస్‌ అధికారులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…..రూ.9,86,000 విలువగల ఓ చెక్కు క్లియరెన్సుకు ముందు ధ్రువీకరణ కోసం బ్యాంకు సిబ్బంది బుధవారం మధ్యాహ్నం ట్రస్టు కార్యదర్శికి ఫోన్‌ చేయటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్‌ 1, 3 వ తేదీల్లో కూడా ఇదే విధంగా రూ. 2,50,000, రూ.3,00,000ల విలువ గల రెండు నకిలీ చెక్కులు జమ చేసి ట్రస్టు సొమ్ము కాజేసినట్టు కనుగొన్నారు. ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* వైకాపా పాలన ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు భంగం కలిగించేలా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. నిరంకుశ పాలనతో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తు్న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్వేది, కె.బిట్రగుంటలో పవిత్ర రథాలను దహనం చేశారని.. పిఠాపురంలోనూ ఇలాంటి ఘటనే జరిగిందని మండిపడ్డారు. తిరుమలలో ఏకంగా తితిదే అధికారులే అన్యమత ప్రచారం చేశారని చంద్రబాబు ఆరోపించారు. సింహాచలం ఆలయ బోర్డును అక్రమంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ ఘటనలకు ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏమాత్రం బెరుకు లేకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం శివసేన..సోనియా సేనగా మారిపోయిందని విమర్శలను తీవ్రతరం చేశారు. గురువారం వరస ట్వీట్లలో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు.

* బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి రాజకీయ మలుపు తీసుకుంది. అది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, శివసేన పార్టీ మధ్య వివాదానికి దారితీసింది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ నకిలీ ప్రచారం చేస్తూ, రాజకీయ లబ్ధిని పొందుతోందని ఆరోపించారు.

* రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని తెలంగాణ ఇంటర్‌బోర్డు ఖరారు చేసింది. ఈనెల 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి మూడు రోజులే సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు జూనియర్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు బోర్డు పేర్కొంది. జనవరి 13, 14 సంక్రాంతి సెలవులు కాగా.. ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ఇంటర్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు.. ఏప్రిల్‌ 17 నుంచి మే 31 వరకు ఇంటర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

* ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలకు భారత్‌లోనూ బ్రేక్‌ పడింది. ఆస్ట్రాజెనికా తిరిగి ప్రయోగాలను ప్రారంభించేంత వరకూ భారత్‌లోనూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) సూచనలను అనుసరిస్తున్నామని.. వీటికి సంబంధించి మరింత వ్యాఖ్యానించలేమని పేర్కొంది.

* మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. ఈ సమయంలో అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్చించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను సమగ్రంగా కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

* కరోనా వైరస్‌ పరీక్షలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ముఖ్యమైన సూచనలు చేసింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మరోమారు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది.

* శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే రఫేల్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొనియాడాడు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నాడు. భీకరంగా పోరాడే అత్యుత్తమ ఫైటర్‌ జెట్‌ ఫైలట్లు వీటిని నడుపుతారని వెల్లడించాడు. ఈ మేరకు అతడు వరుస ట్వీట్లు చేశాడు.