Politics

మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తామంటున్న కేసీఆర్

మోడీ సర్కార్‌పై పోరాటం చేస్తామంటున్న కేసీఆర్

కేంద్రం తీరుపై సహనం నశించిందని.. ఇకపై రాష్ట్రానికి రావాల్సినవి పోరాడి సాధించుకుందామని తెరాస ఎంపీలకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలకోసం పార్లమెంట్‌లో రాజీ పడకుండా పోరాటం చేయాలని సూచించారు. త్వరలో పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రగతిభవన్‌లో ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్‌ లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల అమల్లో కేంద్రం ఏడేళ్లుగా అన్యాయం చేస్తోందని ఆరోపించింది. కృష్ణా జలాల వివాదాన్ని తేల్చడం లేదని, అంతర్రాష్ట్ర వివాదాల్లో కేంద్రం అసమర్థత వల్ల రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని తెరాస పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పూర్తిగా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించింది. జాతీయ రహదారులపై కేంద్రం మాట తప్పిందని.. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన 22 నవోదయ పాఠశాలలపై కేంద్రం నోరు మెదపడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎస్టీ బకాయిలపై సభ, లోపల బయట ధ్వజమెత్తాలని తెరాస నిర్ణయించింది. గాంధీ విగ్రహం వద్ద కరోనా జాగ్రత్తలతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపింది. వరంగల్ చేనేత పార్కుకు రూపాయి కూడా ఇవ్వలేదని.. ఎనిమిది ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించుకుంటామంటే అనుమతులు ఇవ్వడం లేదని మండిపడింది.