Devotional

త్రిశూలం…సుదర్శన చక్రం అలా వచ్చాయి!

త్రిశూలం…సుదర్శన చక్రం అలా వచ్చాయి!

అత్యంత శక్తివంతమైన, తిరుగులేని మహాయుధాలైన సుదర్శన చక్రం, త్రిశూలాల పుట్టుక కథ ఎంతో ఆసక్తికరం. విశ్వకర్మ వీటిని సూర్యుని రజనుతో తయారుచేయడం వెనుక పెద్ద నాటకీయ పరిణామాలే చోటు చేసుకొన్నట్టు పౌరాణిక సాహిత్యం చెబుతున్నది. కశ్యప ప్రజాపతి, అదితిల పెద్ద కొడుకైన సూర్యుడు లోకాలకు వెలుగును ప్రసాదించే కొలువులో కుదురుకున్నాడు. బృహస్పతి చెల్లెలు యోగసిద్ధి (ప్రభ), ప్రభాసుల కొడుకు విశ్వకర్మ. ఈ దేవశిల్పి భార్య హ్లాదిని. వీళ్లమ్మాయి సంజ్ఞాదేవినే సూర్యునికిచ్చి విశ్వకర్మ వివాహం జరిపించాడు. సూర్యుడు-సంజ్ఞ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. పెద్ద కొడుకు శ్రాద్ధదేవుడికి వైవస్వతుడనీ పేరున్నది. ఇతడు మనువు. మనమిప్పుడు వైవస్వత మన్వంతరంలోనే జీవిస్తున్నాం. రెండవ కొడుకు యముడు. భర్తను కూడినప్పుడు ఆయన తేజస్సును తట్టుకోలేక సంజ్ఞాదేవి కండ్లు మూసుకొన్నదట. సూర్యునికి కోపం వచ్చి ‘అఖిల జనైక సంయమనుడైన పుత్రుడు పుడతాడు నీకు’ అన్నాడట. ‘సంయమించడం’ అంటే ‘చలించడం’. ప్రాణుల జీవితాలను చలింపజేస్తాడని భావం. ఈ రకంగా అతడు ‘పితృలోకాధిపతి’ అయినాడు. మూడవ సంతానం యమున. ఈ పర్యాయం సంజ్ఞ కండ్లు మూసుకోలేదు కానీ, భర్తను ‘చంచల దృక్కుల’తో చూసింది. ‘విలోలిత అయిన కూతురు పుడుతుంది’ అన్నాడు సూర్యుడు. ‘విలోలిత’ అంటే ‘సదా చలించేది’. కనుక, యమున అలలతో కూడింది అయింది. సంజ్ఞకు భర్త తేజస్సును తట్టుకోవడం కష్టమైపోయింది. పైగా ఏ క్షణాన ఏమంటాడో తెలియదు. తన నీడ(ఛాయ)కు ప్రాణం పోసింది. ఛాయ ముమ్మూర్తులా సంజ్ఞను పోలి ఉన్నది. ‘నేను పుట్టింటికి వెళుతున్నాను. తిరిగి వచ్చేవరకు నువు సూర్యునితో కాపురం చెయ్యి ఎట్టి పరిస్థితులలో నువు ఛాయాదేవివన్న సంగతిని సూర్యునికి తెలియనీకు’ చెప్పింది సంజ్ఞ. ‘సరే’నంది ఛాయ. పుట్టింటికి వెళ్లింది సంజ్ఞ. కొంతకాలం బాగానే వుంది. ‘భర్తపై అలిగి వచ్చింది కూతురు’ అని గ్రహించిన విశ్వకర్మ తనకి నచ్చజెప్పి అత్తారింటికి పంపించాడు. సంజ్ఞకు భర్త దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక అశ్వ రూపాన్ని ధరించి ‘బడబ’ అనే పేరుతో ఉత్తర కురుభూములలో సంచరించసాగింది. ఛాయకు సూర్యునివల్ల శని, సావర్ణి, తపతి అనే సంతానం కలిగారు. మొదట్లో అందరినీ సమానంగా చూసిన ఛాయకు రాన్రాను సవతి తల్లి లక్షణాలు వచ్చాయి. సంజ్ఞ పిల్లలను తేడాగా చూడసాగింది. దాంతో విషయం సూర్యునికి తెలిసింది. ‘తానిప్పటి వరకు కాపురం చేస్తున్నది సంజ్ఞతో కాదు, ఛాయాదేవితో’ అని తెలిసిన సూర్యుడు సంజ్ఞను వెదుక్కుంటూ బయలుదేరాడు.

ఉత్తర కురుభూములలో ‘బడబ’గా సంచరిస్తున్న భార్యను గుర్తుపట్టాడు. ఇన్నాళ్ల విరహవేదన కారణాన సంజ్ఞకూడా అశ్వరూపాన్ని ధరించి వస్తున్న భర్తను ప్రేమపూర్వకంగా ఆహ్వానించింది. అమ్మాయీ, అల్లుడు ఉన్న విషయం తెలుసుకున్న విశ్వకర్మ ఆ ప్రాంతానికి చేరుకొన్నాడు. ‘భర్తపైన ఇంత ప్రేమ వున్న దానివి ఇలా వచ్చేశావేంటమ్మా’ అని కూతుర్ని మందలించాడు. ‘ఆయన దేహాన్నుండి వెలువడే వేడిమిని తట్టుకోలేక పోతున్నాను నాన్నా’ అసలు సంగతి చెప్పింది సంజ్ఞాదేవి. ‘అల్లుడు ఒప్పుకొంటే ఆయన వేడిని తగ్గిస్తాను’ అని విశ్వకర్మ అనడంతో సూర్యుడు ‘సరే’నన్నాడు. సూర్య కిరణాలకు చిత్రిక పట్టి వేడిమిని తగ్గించాడు విశ్వకర్మ. దాంతో సంతోషంగా కాపురానికి వెళ్లింది సంజ్ఞాదేవి. ఛాయాదేవి పక్కకు తప్పుకొంది. సూర్యకిరణాలకు చిత్రిక పట్టేప్పుడు రాలిపడ్డ రజనుతో చక్రాయుధాన్ని తయారుచేసి విష్ణుమూర్తికి, త్రిశూలాన్ని చేసి శివునికి, శంఖాలను తయారు చేసి వసువులకు బహుకరించాడు విశ్వకర్మ. ఇంకా మిగిలిన రజనుతో ఇంద్రుని వజ్రాయుధానికి ధారను కూడా పెట్టిచ్చాడు. ఎంతో శక్తివంతమైన ఈ ‘దేవతా ఆయుధాల పుట్టుక’ వెనుక ఉన్న అసలు కథ ఇదన్నమాట.