DailyDose

మరో నెలరోజుల్లో అమెరికాను భారత్ దాటెస్తుంది-TNI బులెటిన్

మరో నెలరోజుల్లో అమెరికాను భారత్ దాటెస్తుంది-TNI బులెటిన్

* ఏపీలో 544791 కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు.ఇతర రాష్ట్రాలు,విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 547686. గడిచిన 24 గంటల్లో కొత్త 9999 కేసులు నమోదు.

* ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయిన దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో ఉంది. భారత్‌ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత వ్యాప్తి ఇలాగే కొనసాగితే అక్టోబర్‌ మొదటి వారంలో అగ్రరాజ్యాన్ని సైతం భారత్‌ వెనక్కి నెట్టవేయనుందని హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ అంచనా వేసింది. అంటే మరో నెల రోజుల వ్యవధిలో కొవిడ్‌ కేసుల సంఖ్యలో అమెరికాను భారత్‌ దాటివేయనుంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 65 లక్షల కేసులు ఉన్నాయి. భారత్‌లో 45 లక్షల 62 వేలు దాటాయి. ఈ సంఖ్య అక్టోబర్‌ నాటికి 70 లక్షలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ‘అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌’ విధానాన్ని ఉపయోగించి కొవిడ్‌ కేసుల సంఖ్యను అంచనా వేశారు. ఈ విషయాన్ని అధ్యయనానికి నేతృత్వం వహించిన అప్లైడ్‌ మ్యాథమేటిక్స్‌ విభాగానికి చెందిన పరిశోధకురాలు డాక్టర్‌ టి.ఎస్‌.ఎల్‌.రాధిక తెలిపారు. తమ పరిశీలనలను ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’కు పంపినట్లు పేర్కొన్నారు. అయితే, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యపైనా కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీర్ఘకాలంలో కేసుల సంఖ్యను అంచనా వేసేందుకు మరింత మెరుగైన విధానాన్ని రూపొందించే పనిలో ఉన్నామని వెల్లడించారు.

* ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అధికారికంగా 45 లక్షల 62 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే, ఐసీఎంఆర్‌ మాత్రం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మే నెల నాటికే దేశంలో దాదాపు 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది, ఈ మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్‌ ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చిలో ప్రచురించింది. దేశంలో 0.73 శాతం మంది మధ్య వయస్కులు మే నెల నాటికే కొవిడ్‌ బారిన పడ్డారని సర్వేలో తేలింది. వీరిలో 43.3 శాతం మంది 18-45 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారే. 46-60 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 39.5 శాతం మంది, 60 ఏళ్ల పైబడిన వారిలో 17.2 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు గుర్తించినట్లు సర్వే తెలిపింది. ఈ మేరకు 21 రాష్ట్రాల్లోని 28 వేల మంది రక్త నమూనాలను పరీక్షించారు.

* తుదిదశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేయడం ఓ మేల్కొలుపు మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ స్పష్టంచేశారు. ఇలాంటి వాటికి మరింత సిద్ధంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే పరిశోధకులు మాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణమని స్పష్టంచేసింది.

* భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 96,551 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 70,880 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 9,43,480 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌ బారిన పడి చికిత్సపొందుతున్న వారిలో దాదాపు 74శాతం మంది తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.