Health

సాంప్రదాయ పద్ధతులు మరిచిపోయారు

సాంప్రదాయ పద్ధతులు మరిచిపోయారు

వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు కొన్ని మాత్రమే నేడు అరుదుగా అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి ఉంటుంది. కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీరియా సోకకుండా యాంటీసెప్టిక్ గా, యాంటీ బయాటిక్ గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్లలోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే… ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని పెద్దలు చెబుతారు. పిల్లలకు అమ్మవారు(వైరల్ ఇన్ఫెక్షన్ ) సోకితే క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం.