Food

కొవ్వు అదుపులో ఉండాలంటే…బార్లీ గింజలు

కొవ్వు అదుపులో ఉండాలంటే…బార్లీ గింజలు

బార్లీ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరంచేసే శక్తి వీటిలో ఉందని అంటున్నారు. చిన్నపిల్లలకు బార్లీ నీటిని తాగించడం వల్ల మూత్రం చెడువాసన రాకుండా ఉంటుంది. బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్దపేగును శుభ్రపరిచి, కోలన్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.
హార్మోన్లకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది.
తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుగా ఉండేవారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. వేడిచేసిన వారు బార్లీ నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. బార్లీ నీటిలో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నీటిలో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకాగాన్‌ గ్లూకోజ్‌ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది.
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. బీపీ కూడా అదుపులో ఉంటుంది. బార్లీ నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. గర్భవతులు బారీ నీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బాలింతలకు బార్లీ నీటిని తాగిస్తే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
బార్లీ నీటిని ఇలా తయారుచేసుకోవాలి…
ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకొని, అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి, కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి.