DailyDose

ఇండియాలో విపరీతంగా నూతన కేసులు-TNI కరోనా బులెటిన్

ఇండియాలో విపరీతంగా నూతన కేసులు-TNI కరోనా బులెటిన్

* దేశంలో ఒక్కరోజే 97,570 కరోనా కేసులు.భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఒక్కరోజే 97 వేల 570 మందికి వైరస్​ సోకింది.మరో 1201 మరణాలు నమోదయ్యాయి.మొత్తం కేసుల సంఖ్య 46 లక్షల మార్కు దాటింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

* ఇటీవల తాను కరోనా టెస్టు‌ చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యిందని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ తెలిపారు‌. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దీంతో నటీనటులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సైతం తన తదుపరి బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా అర్జున్‌కపూర్‌తో కలిసి నటించేందుకు ముంబయికి చేరుకున్నారు. కానీ అర్జున్‌కపూర్‌ కొవిడ్‌ బారినపడడంతో సదరు చిత్రబృందం షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 76,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9901 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 శాంపిల్స్‌ పరీక్షించగా.. 5,57,587 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 4,57,008 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4846 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 95,733 యాక్టివ‌ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో కొత్తగా 10,292 మంది డిశ్చార్జి అయ్యారు.

* భారత్‌లో కరోనా కొత్త కేసులు రోజురోజుకీ గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,91,251 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 97,570 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. వీరిలో 9,58,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 36,24,196 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,201 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 77,472కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.77 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.66 శాతంగా ఉంది. అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక కేసుల సంఖ్య 14,836 మేర పెరిగింది.

* ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొందరికి టీకా ఇచ్చినందున భద్రతా పర్యవేక్షణను మరింత పెంచాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)ను భారత ఔషధ నియంత్రణ సంస్థ కోరింది. అలాగే ఆ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక, నివేదికను సమర్పించాలని చెప్పింది. మూడో దశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆక్స్‌ఫర్డ్ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భారత్‌లో కూడా ఆ ట్రయల్స్‌కు బ్రేక్‌ పడింది. ఈ సమయంలో ఎస్‌ఐఐకు నియంత్రణ సంస్థ ఈ ఆదేశం జారీ చేసింది. అలాగే అప్పటి వరకు వాలంటీర్ల నియామకం చేపట్టవద్దని వెల్లడించింది. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందాలంటే ఎస్‌ఐఐ భారత్‌, యూకే కు చెందిన డేటా అండ్ సేప్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్‌ఎంబీ) నుంచి పొందిన అనుమతి పత్రాన్ని సమర్పించాలని సూచించింది.