ScienceAndTech

అమెరికాలో ఆ వింత కొలతల మతలబు ఏమిటి?

అమెరికాలో ఆ వింత కొలతల మతలబు ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ కొలతల విషయంలో ఒకేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మెట్రిక్‌ సిస్టమ్‌ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ యూనిట్స్‌)ను అనుసరిస్తాయి. అందుకే మనం బరువును గ్రాములు, కిలోల లెక్కన.. దూరాన్ని మీటర్లు, ద్రవాలను లీటర్లు, ఉష్ణోగ్రతను సెల్సియస్‌ లెక్కన కొలుస్తాం. ఈ విషయంలో అమెరికా భిన్నం. అక్కడ బరువును పౌండ్లలో, దూరాన్ని మైళ్లలో, ద్రవాన్ని ఔన్స్‌లో, ఉష్ణోగ్రతను ఫారన్‌హీట్స్‌లో కొలుస్తారు. ఎందుకిలా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి దానికి కారణమేంటో మీరే చదవండి.. మొదట్లో కొలతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండేవి. స్థానిక వాణిజ్యమే ఉండేది కాబట్టి పెద్దగా ఇబ్బందులు రాలేదు. అయితే 18వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ విప్లవం మొదలైంది. ఫ్రాన్స్‌లో వ్యాపారాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో సరకుల కొనుగోళ్ల సమయంలో, ప్రజల వద్ద కొలతల ఆధారంగా వసూలు చేసే పన్నుల విషయంలో తేడాలు రావడాన్ని ప్రభుత్వం గమనించింది. కొందరు అమాయక ప్రజల వద్ద తప్పుడు కొలతలు చూపించి పన్నులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో అన్ని చోట్లా ఒకే కొలతల విధానం ఉండాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 1790ల్లో కొత్త కొలతల విధానం రూపొందించాలని ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ను ప్రభుత్వం కోరింది. ఫ్రాన్స్‌ ఇతర దేశాలను ఆక్రమించడంతో అక్కడ కూడా ఈ మెట్రిక్‌ విధానమే అమల్లోకి వచ్చింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ మెట్రిక్‌ యూనిట్స్‌ ప్రామాణిక యూనిట్స్‌గా మారిపోయింది. అయితే, ఈ మెట్రిక్‌ యూనిట్స్‌ విధానాన్ని బ్రిటన్‌ ఒప్పుకోలేదు. సొంతంగా సృష్టించుకున్న బ్రిటీష్‌ ఇంపీరియల్‌ యూనిట్స్‌ (ఔన్స్‌, మైళ్లు, పౌండ్లు)నే కొంతకాలం కొనసాగించింది. అయితే తర్వాత కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం దృష్ట్యా బ్రిటన్‌ కూడా మెట్రిక్‌ విధానాన్నే ఉపయోగించాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ అమెరికా మాత్రం ఇంపీరియల్‌ యూనిట్స్‌నే వాడుతోంది. బ్రిటన్‌ అనేక దేశాలను పరిపాలించిన విషయం తెలిసిందే. ఆంగ్లేయులు పాలించిన ప్రాంతాల్లో ప్రస్తుత అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. అదే సమయంలో అమెరికాలో అనేక కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్‌ ఇంపీరియల్‌ కొలతలనే ప్రామాణికంగా తీసుకునేవారు. బ్రిటీష్‌ నుంచి స్వాతంత్ర్యం పొందినా పరిశ్రమలు, కార్మికులు, ప్రజలు ఈ కొలతలకే అలవాటు పడటంతో.. మెట్రిక్‌ యూనిట్స్‌ విధానంలోకి మారడానికి అప్పట్లో అమెరికా ఇష్టపడలేదు. ఆ కొలతలనే కాస్త అటు ఇటుగా మార్చి ‘యూఎస్‌ కస్టమరీ యూనిట్స్‌’గా ఉపయోగించడం మొదలుపెట్టింది అమెరికా. ఒకవేళ మెట్రిక్‌ యూనిట్స్‌కి మారాలంటే దేశంలోని అన్ని సాఫ్ట్‌వేర్స్‌, టెక్నికల్‌ డ్రాయింగ్స్‌, ఆపరేషనల్‌ కొలతలను మార్చాల్సి ఉంటుంది. డబ్బు, సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తుందని అమెరికన్లు దీనిని వ్యతిరేకించారు. అయితే 1975లో అప్పటి అమెరికా అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫొర్డ్‌ మెట్రిక్‌ కన్వర్షన్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. యూనిట్స్‌ను స్వచ్ఛందంగా మార్చాలని పేర్కొన్నారు. దీంతో అమెరికన్లు మెట్రిక్‌ యూనిట్స్‌కి మారడానికి ఆసక్తి చూపలేదు. అయితే ప్రపంచ వాణిజ్యంలో వెనకబడతామేమోనని భావించిన అమెరికా ప్రభుత్వం.. 1988లో ప్రభుత్వ రంగ సంస్థలు మెట్రిక్‌ యూనిట్స్‌ అమలు చేయాలని ఆదేశించింది. అయితే ప్రైవేటు రంగానికి ఈ నిబంధనను అమలు చేయలేదు. దీంతో ఇప్పటికి అక్కడి ప్రజలు యూఎస్‌ కస్టమరీ యూనిట్స్‌నే ఉపయోగిస్తున్నారు. అదండీ అమెరికాలో కొలతల వెనుకున్న కథ..! అమెరికాతో పాటు మయన్మార్‌, లైబెరియా దేశాలు కూడా మెట్రిక్‌ యూనిట్స్‌ను కాకుండా ఇంపీరియల్‌ యూనిట్స్‌నే ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయట.