Business

టిక్‌టాక్‌పై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం-వాణిజ్యం

టిక్‌టాక్‌పై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం-వాణిజ్యం

* సెప్టెంబర్‌ 14వ తేదీ నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్‌ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురషుకో విలేకర్లకు వెల్లడించారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌ టీకాలను పరీక్షల నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఇప్పుడు పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ తొలిబ్యాచ్‌లు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరుకొంటాయన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందకు రష్యా ఈ టీకాను విడుదల చేసిన వారానికి ఈ ప్రకటన వెలువడింది.

* ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు చైనా ససేమిరా అంటోంది. విక్రయించడం కన్నా ఆ దేశంలో టిక్‌టాక్‌ను పూర్తిగా మూసేయడమే మంచిదని మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించాలా? మూసేయాలా? అన్నదానిపై బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు పొడిగించేది లేదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

* అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో చమురు ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై 13 పైసలు, డీజిల్‌పై 12 పైసలను చమురు రంగ సంస్థలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.81.99 ఉండగా ప్రస్తుతం రూ.81.86కు చేరింది. మూడు రోజుల్లో పెట్రోల్‌ ధరను తగ్గించడం ఇది రెండోసారి. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌ 10న మొదటిసారి పెట్రోల్‌ ధరను 9 పైసలు తగ్గించగా ఇప్పుడు 12 పైసలు తగ్గించారు. ఆరు నెలల తర్వాత సెప్టెంబర్‌ 3న మొదటిసారి డీజిల్‌ ధర తగ్గించిన సంస్థలు ఈరోజు మరోసారి ధరలను కుదించాయి. దిల్లీలో లీటర్‌ ధర రూ.73.05 ఉండగా ఇప్పుడు రూ.72.93కి చేరింది.

* తొమ్మిది రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలే కరోనావైరస్‌ కారణంగా ఉపాధి దెబ్బతిన్న వారికి ఇది మరింత భారంగా మారింది. ఇప్పుడు చాపకింద నీరులా ఇంధన ధరలు పెరగడం రవాణా రంగం సహా ఇతర రంగాలపై ప్రభావం చూపించనుంది. అసలు ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గితే ఆ ప్రభావం ఎందుకు కనిపించడంలేదు.. భారత్‌లో చమురు ధరలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించారు. అంటే అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా ఆ ప్రభావంతో ధరలు పతనం అవ్వాలి. కానీ, అలా జరగడంలేదు. గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పతనం అయ్యాయి. కానీ, మన మార్కెట్లలో ఆ స్థాయి తగ్గింపు కనిపించలేదు. పైగా గత తొమ్మిది రోజుల నుంచి మాత్రం క్రమం తప్పకుండా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 82 రోజుల విరామం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పైగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు జూన్‌ 1 తర్వాత నుంచి మళ్లీ తగ్గుతున్నాయి. భారత్‌లో చమురు ధరలపై ప్రభుత్వ నియంత్రణ వదులుకోవడం అనేది వాస్తవ పరిస్థితుల్లో కనిపించదు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారుడితో పంచుకొంటారు. అదే ధరలు పతనమైన సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం పన్నులను పెంచుతుంది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. చివరికి ఉన్న ధరలను కొనసాగించడమే వినియోగదారుడికి పెద్ద ఊరడింపు అన్న పరిస్థితి కలుగుతుంది. గత ఫిబ్రవరి నుంచి ఇదే జరిగింది. ఇంధన ధరలపై నియంత్రణను వదులుకున్నాక కూడా అంతిమంగా అత్యధిక లాభం ప్రభుత్వాలకే వెళ్తోంది. కొంత ఇంధన కంపెనీలకు చేరుతోంది.