DailyDose

ఫ్రాన్స్‌లో తిరిగి విజృంభిస్తున్న కరోనా-TNI బులెటిన్

ఫ్రాన్స్‌లో తిరిగి విజృంభిస్తున్న కరోనా-TNI బులెటిన్

* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 72,233 నమూనాలను పరీక్షించగా 9,536 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,67,123కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 66 మంది మృతిచెందారు. అనంతపురంలో జిల్లాలో 7 మంది, నెల్లూరు 7, ప్రకాశం 7, కడప 6, విశాఖపట్నం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, కర్నూలు 5, గుంటూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 3, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 4912కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10,131 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,99,826 నమూనాలు పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. 95,072 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.

* యూరప్‌ దేశాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఒక్కరోజు వ్యవధిలోనే 10,561 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 10వేల కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. రెండు రోజుల క్రితం అత్యధికంగా ఒక్కరోజే 9వేల కేసులు బయటపడ్డాయి. లాక్‌డౌన్ నిబంధనల‌ సడలింపుల అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న సమయంలోనే వైరస్‌ ఉద్ధృతి పెరిగినట్లు ఫ్రెంచ్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన వారం రోజుల్లో దాదాపు 2432 మంది ఆసుపత్రుల్లో చేరగా వారిలో 417మంది ఐసీయూలో చికిత్స అందిస్తోన్నట్లు పేర్కొంది. నిన్న ఒక్కరోజే 17మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. వైరస్‌ తీవ్రత మరింత పెరగడంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న 772 ప్రాంతాలను గుర్తించి వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టింది.

* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 56,217 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,216 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,57,096కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 961కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,603 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,24,528కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,607 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 21,34,912కి చేరింది.

* సెప్టెంబర్‌ 14వ తేదీ నాటికి రష్యాలోని అన్ని ప్రాంతాలకు కోవిడ్‌ టీకాలు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురషుకో విలేకర్లకు వెల్లడించారు. ఇప్పటికే తొలి బ్యాచ్‌ టీకాలను పరీక్షల నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఇప్పుడు పంపిణీ వ్యవస్థను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ తొలిబ్యాచ్‌లు ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాటికి గమ్యస్థానాలకు చేరుకొంటాయన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందకు రష్యా ఈ టీకాను విడుదల చేసిన వారానికి ఈ ప్రకటన వెలువడింది.