Devotional

శివుడు అర్థమైతే సత్యం బోధపడుతుంది

శివుడు అర్థమైతే సత్యం బోధపడుతుంది

గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనందమూర్తి. ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.

“ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ – చిన్న గానీ – సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు – అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే!

1. జ్యోతిర్లింగాలు: .
శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…(జ్ఞానాన్ని) ప్రసాదించేది.

2.లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడుగా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం?
శివుడు మూడు ప్రళయములకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం. స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ (మనసు), కారణ (అజ్ఞానం) శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది.
మూడు : మహాప్రళయం : సమస్తం శివునిలో కలిసిపోవడం.
అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

4. శివ, విష్ణు, బ్రహ్మ : శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

5. మరణం ఒక వేడుక : వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలంలో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ హరతికి…. ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

6. పంచభూత లింగాలు : దక్షిణ భారతంలోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం, జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కాని దింకేమైనా ఉందా ?

7. శక్తి సూత్రం : శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.

8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే — దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )

9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం — శ్రవణ, మనన, నిధి, ధ్యాసాలు (ధ్యానం) .

10. అద్వైతం : అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ, స్థితి, మరణం -ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.