Movies

రకుల్‌ప్రీత్ పేరు లేదు

రకుల్‌ప్రీత్ పేరు లేదు

అగ్ర కథానాయిక సమంత తన సహ నటీమణులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌కు క్షమాపణలు చెప్పారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణలో డ్రగ్స్‌ కోణం ఉన్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటీవల సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, విచారణ చేస్తోంది. సుశాంత్‌ కోసం మత్తు పదార్థాలు తెప్పించేదాన్నని, ఇటీవల విచారణలో రియా ఒప్పుకొన్నారు. అంతేకాదు 14 రోజుల కస్టడీలో ఉన్న రియా 20 పేజీల వివరణాత్మక స్టేట్‌మెంట్‌ను ఎన్‌సీబీకి అందించారని, అందులో డ్రగ్స్‌ తీసుకుంటున్న 25 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారని ప్రచారం జరిగింది. ఎన్‌సీబీకి అందించిన పత్రాల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌ పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అనేక వెబ్‌సైట్లు కథనాలు రాయడంతో శనివారం రకుల్‌ప్రీత్‌పై నెటిజన్లు అనేక కామెంట్లు చేశారు. అయితే రకుల్‌, సారా పేర్లు జాబితాలో లేవని తాజాగా ఎన్‌సీబీ పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌ ప్రముఖుల జాబితాను మేం సిద్ధం చేయలేదు. మాదకద్రవ్యాల ముఠా, సరఫరా దారుల వివరాలు గుర్తించాం. అందరూ ‘బాలీవుడ్‌’ ప్రముఖుల పేర్లని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని అన్నారు. అనంతరం రియా నటీమణులు రకుల్‌, సారా పేర్లు చెప్పారని తెలిసింది? అని మల్హోత్రాను ప్రశ్నించగా.. ‘వారి పేర్లు లేవు’ అని చెప్పారు. దీంతో రకుల్‌, సారా తప్పు లేదని తెలుసుకున్న నెటిజన్లు ‘సారీ రకుల్‌’, ‘సారీ సారా’ అని పోస్ట్‌లు చేస్తున్నారు. నటి సమంత కూడా అందరి తరఫున క్షమాపణలు చెప్పారు.