DailyDose

ఏపీలో 5వేల కరోనా మరణాలు-TNI బులెటిన్

ఏపీలో 5వేల కరోనా మరణాలు-TNI బులెటిన్

* క‌రోనాపై పోరాటం ఇంకా పూర్తికాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ద‌న్‌ చెప్పారు.భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న‌ద‌ని ఆయ‌న‌ తెలిపారు.క‌రోనా‌ మహమ్మారిపై మంగళవారం ఆయ‌న‌ రాజ్యసభలో మాట్లాడారు.దేశంలో న‌మోద‌వుతున్న మొత్తం కేసుల‌లో మృతుల రేటు 1.67 శాతంగా, కోలుకుంటున్న వారి రేటు 77.65 శాతంగా ఉందని హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ చెప్పారు. 

* తిరువూరు పీపీ యూనిట్ లో 24 మందికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు. కొత్తగా మరో ఏడుగురికి పాజిటివ్. 122 మంది నుంచి శ్వాబ్ శాంపిల్స్ సేకరణ. రాజుగూడెం పీహెచ్ సీ లో 10 మందికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు. మునుకుళ్లకు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్.

* కరోనా మహమ్మారి మానవ శరీరంలో ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కొవిడ్‌ రోగులకు కచ్చితమైన చికిత్స ఏదీ లేనప్పటికీ.. కరోనా వల్ల అధిక మరణాలు సంభవించడానికి సైటోకైన్ల ఉప్పెన(సైటోకైన్‌ స్టార్మ్‌) ఓ కారణమని భావిస్తున్నారు. కానీ, తాజా నివేదికలు మాత్రం దీనికి భిన్నగా సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా శరీరంలో సైటోకైన్ల స్థాయికి, కరోనా మరణాలకు సంబంధం లేకపోవచ్చని అంటున్నాయి.

* కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మహమ్మారి‌ వ్యాప్తిపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. కరోనాతో కలిసి జీవించాల్సిందేనని పలువురు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతుండగా.. తాజాగా మరోసారి అదే నిజమని స్పష్టమైంది. ఈ వైరస్‌ సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్న తర్వాత సీజనల్‌ వైరస్‌గా మారిపోయే అవకాశముందని అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ బీరుట్‌కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అప్పటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దీని ప్రభావం అంతగా కనిపించదని తేలింది.

* ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 70,511 నమూనాలను పరీక్షించగా.. 8,846 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,83,925కు చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 69 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రకాశం జిల్లాలో 10 మంది, చిత్తూరు 9, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, కృష్ణా 6, కడప 5, విశాఖపట్నం 5, గుంటూరు 4, నెల్లూరు 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, కర్నూలు 3, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5,041కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47,31,866 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం 92,353 యాక్టివ్‌ కేసులున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

* కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్‌ సహకారం ఎంతో అవసరమని ఆయన‌ అభిప్రాయపడ్డారు. మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ ముందుగానే అభివృద్ధి చేసినా.. తయారీలో మాత్రం భారత్‌ సహకారం ఎంతో కీలకమన్నారు. సమర్థవంతమైన, సురక్షితమైన వాక్సిన్‌ వచ్చిన వెంటనే, భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని బిల్‌గేట్స్‌ తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదిలోనే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. 2021 సంవత్సరం తొలి త్రైమాసికానికి చాలా వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ అతిపెద్ద పాత్ర పోషించనుందన్న ఆయన, వీటిని అభివృద్ధి చెందుతోన్న దేశాలకు తరలించడం మాత్రం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీలో భారత్‌ పాత్ర’ అనే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

* దేశంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 38లక్షలకు(78శాతం) పైగా కొవిడ్‌ రోగులు వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది. రోజూ దాదాపు 80వేల మంది కోలుకుంటున్నట్లు పేర్కొంది. దిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనే కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ఐదులో ఒకటో వంతు మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 14 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా 18 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు 5వేల నుంచి 50వేల మధ్యలోనే ఉన్నాయి. కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 50వేల కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మూడు రాష్ట్రాల్లోనే 48శాతం క్రియాశీలక కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివ్‌ కేసుల సగటు 8.4శాతం ఉందన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదు. ప్రస్తుతం 6,900 మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రాష్ట్రాలు సరైన నిర్వహణ చేపట్టి ఆక్సిజన్‌ను సమయానికి అందుబాటులో ఉండేలా నిర్దారించుకోవాలి’అని తెలిపారు.