Health

ఆకలి ఉండట్లేదా?

ఆకలి ఉండట్లేదా?

ఆకలి లేకపోయినా తినడం, అతిగా తినడం, వేళ తప్పి తినడం, చిరుతిళ్లు, నిద్రలేమి, ఆహారంలో పీచుపదార్థం లేకపోవడడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి అజీర్తి వెనకున్న అనేక కారణాల్లో కొన్ని. వీటి నుంచి బయటపడడానికి జీవనశైలిలో మార్పులు చేసుకుంటూనే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు చేర్చుకోవడం చాలా అవసరం.అల్లం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. పరగడుపున తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. తేన్పులు, కడుపు ఉబ్బరం, ఛాతిలో మంట, వికారం, వాంతి భావన తగ్గుతాయి. భోజనానికి ముందు అయితే అల్లం రసంలో తేనె కలిపి తీసుకోవచ్చు. భోజనంలో అయితే అల్లం చట్నీ వేసుకోవచ్చు. పచ్చి అల్లం ముక్కల్ని తేనెలో ముంచి కూడా తినవచ్చు.తమలపాకులో లవంగాలు, యాలకులు సోంపు వేసుకుని భోజనం తర్వాత తినవచ్చు. తమలపాకులో జాజికాయ ముక్క వేసుకుంటే జీర్ణక్రియ బాగా జరగడంతో పాటు రాత్రివేళ నిద్ర పట్టని వారికి ఆ సమస్య తొలగిపోతుంది.మెంతులు, సోంపు, నల్ల జీలకర్ర వేగించి, పొడి చేసుకుని భోజనం తర్వాత నోట్లో వేసుకుంటే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.భోజనం తర్వాత కాసేపు ఎడమ వైపు పడుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది.దాల్చిన చెక్క పొడి జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది. షుగర్‌ నిల్వల్ని నియంత్రిస్తుంది.భోజనం తర్వాత భాస్కర లవణం వేసుకుంటే, జీర్ణక్రియ సులువవుతుంది.జీలకారిష్టం, అర్జునారిష్టం ఇలా అరిష్టాలుగా పేర్కొనే ద్రావణాలన్నీ ఆమ్లాన్ని తగ్గించడంతో పాటు జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి.భోజనానికి గంట ముందు గోరువెచ్చని నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవడం వల్ల గానీ, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల గానీ, ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.వేడి అన్నంలో నెయ్యి వేసుకుని రెండు చిటెకెల సైంధవ లవణం కలిపి తొలి మూడు ముద్దలు తింటే సులభంగా జీర్ణమవుతుంది.అరచెంచా ఇంగువ, ఐదారు చుక్కల నెయ్యి వేసి కాస్త వేగించి, ఆ పొడిని అన్నం తొలి మూడు ముద్దల్లో తింటే హాయిగా జీర్ణమవుతుంది.త్రికటు (శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు సమభాగాల్లో కలిపిన పొడి) చూర్ణాన్ని రెండు చిటికెలంత ఆహారంతో పాటే తీసుకుంటే సుఖంగా జీర్ణమవుతుంది.లవంగాదివటి లేదా జీలకాది చూర్ణం జీర్ణశక్తిని బాగా పెంచుతాయి.భోజనం చేసే సమయంలో మనసును ఆహారం మీదే లగ్నం చేయడం అవసరం. అలా లేకపోతే, అవసరమైన జీర్ణరసాలు ఉత్పన్నం కాక అజీర్తి సమస్య తలెత్తుతుంది.ధనియాలు వేసి మరిగించిన నీటిని తాగితే జీర్ణశక్తి బాగుంటుంది.బొప్పాయి పండు తింటే, జీర్ణశక్తి పెరగడంతో పాటు, మలబద్ధకం తొలగిపోతుంది. రోజూ ఒక యాపిల్‌ పండుగానీ, జామ పండుగానీ తీసుకోవడం ఎంతో అవసరం.భోజనం తర్వాత ఓ 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.