WorldWonders

సీతాకోక చిలుకల కోసం ప్రత్యేక కేటాయింపు

సీతాకోక చిలుకల కోసం ప్రత్యేక కేటాయింపు

‘నాకేగానీ రెక్కలొస్తే… రంగురంగుల సీతాకోకచిలుకలా స్వేచ్ఛగా ఎగురుతూ పువ్వు పువ్వునీ పలకరిస్తూ తియ్యని మకరందాన్ని ఆస్వాదించేయనూ…’ అనుకోనివాళ్లు ఉండరేమో. అందమైన ఆ రూపంతోపాటు క్షణం నిలకడ లేని ఆ చంచలత్వం వల్లేనేమో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఆ చిట్టి కీటకం అంటే ఎంతో ఇష్టం. వాటిని చూడాలనీ పట్టుకోవాలనీ ఒకటే సరదా. కానీ వన సంపదకి సాయం చేసే ఆ వన్నెల సీతాకోకచిలుకల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. అందుకే సెప్టెంబరు నెలని వాటికోసం కేటాయించి మరీ అవగాహన కలిగిస్తోంది భారత ప్రభుత్వం.
***ఆ కొండా ఈ కోనా అంతా నాదే అనుకుంటూ హాయిగా వనసీమల్లో విహరించే ఆ అందాల సీతాకోకచిలుకకి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ వాటి సంఖ్య తగ్గిపోతోందట. తరచి చూస్తే వాతావరణ మార్పులు, కాలుష్యం, అడవుల నరికివేత, కీటకనాశన మందులు, వాటిని పట్టి బంధించడం… ఇలా కారణాలెన్నో. అదీగాక, అవి మందారం, నూరువరహాలు, అక్షింతలు, బంతి… ఇలా కొన్ని పూలల్లోని మకరందాన్నే తాగుతాయి. ఆ మొక్కల పెంపకం తగ్గిపోవడంతో తేనె దొరకక చనిపోతున్నాయట. నిజానికి ప్రభుత్వంతోబాటు ప్రైవేటు వ్యక్తులూ దేశంలోని పలునగరాల్లోనూ వీటికోసం పార్కులు ఏర్పాటుచేసి వందల, వేల జాతుల్ని పెంచేందుకు కృషిచేస్తున్నారు. సందర్శకులకు ఆనందాన్ని కలిగించడంతోబాటు ఆయా జాతులు అంతరించిపోకుండానూ చూస్తున్నారు. ఎందుకంటే పర్యావరణంలోని జీవవైవిధ్యానికి సీతాకోకచిలుకా కీలకమే. తేనెకోసం పువ్వుపువ్వుకీ వాలినప్పుడు అది తీసుకెళ్లే పుప్పొడి వల్ల ఆయా మొక్కల సంతతి పెరగడంతోబాటు కొత్త జాతుల ఉత్పత్తికీ తోడ్పడుతుంది.
**అవి హాయిగా తిరుగుతూ కనిపించాయంటే అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్లే. అందుకే పార్కుల్లోనే కాకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించేందుకే సెప్టెంబరు మాసాన్ని సీతాకోకచిలుకలకోసం కేటాయించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బటర్‌ఫ్లై రక్షణ సంస్థలూ పర్యావరణ ప్రేమికులూ జీవవైవిధ్య శాస్త్రవేత్తలూ అందరూ కలిసి ప్రధాన నగరాల్లో వర్చువల్‌ మీడియా సాయంతో వర్కుషాపులూ సెమినార్లూ నిర్వహిస్తున్నారు. అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటున్నాయి, వాటిని ఎలా లెక్కించాలి… వంటి విషయాలమీద చర్చిస్తున్నారు. సీతాకోకచిలుక అనగానే గొంగళిపురుగు కీటకంగా మారే లార్వా, ప్యూపా దశలే కదా అనుకుంటాం. కానీ, అవి కాళ్లతో తేనెను రుచి చూసి ట్యూబులాంటి నాలుకతో పీల్చుకుంటాయనీ, వాటి కళ్లు 17 వేల కటకాలతో నిర్మితమై ఉంటాయనీ, అవి అతినీలలోహిత కాంతిలోనూ చూడగలవనీ, వాటి రెక్కలమీద రంగులే ఉండవనీ వాటిమీద ఉండే సూక్ష్మాతిసూక్ష్మమైన పారదర్శక పొలుసులమీద ప్రతిబింబించే కాంతిని మాత్రమే మనం చూస్తామనీ, 55 ఫారన్‌హీట్‌ డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలో సీతాకోకచిలుకలు ఎగరలేవనీ అందరికీ తెలియకపోవచ్చు. అందుకే ఇలాంటి ఆసక్తికర విషయాల్లో క్విజ్‌ ప్రోగ్రామ్‌లూ నిర్వహిస్తున్నారు. వాటిని ఫొటోలూ వీడియోలూ తీయడంలోనూ పోటీలు పెడుతూ వాటిని చూసినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవంలోకి తీసుకొస్తున్నారు. మొత్తమ్మీద ఆ చిట్టి కీటకాల్ని సంరక్షించేందుకు ఎవరికి వాళ్లే ఉన్న వనాల్ని కాపాడుతూ వాటికి నచ్చే తేనెలూరే మొక్కల్ని పెంచే ప్రయత్నంలో భాగమే ఈ బిగ్‌ బటర్‌ ఫ్లై మంత్‌ ప్రధానోద్దేశం.
*పోల్కా చుక్కల్లా!
హరివిల్లు వర్ణాల్ని మరిపించే సీతాకోకచిలుకల్లో కొన్ని ఏక రంగులో కనిపిస్తే, మరికొన్ని రెండు రంగుల్లో పోల్కా చుక్కల్ని తలపిస్తూ కనువిందు చేస్తుంటాయి. మడగాస్కర్‌, జింబాబ్వే, ఇథియోపియాల్లో ఎక్కువగా కనిపించే పారడాప్సిస్‌ పంక్టాటిస్సిమా పసుపు రంగు చీరమీద నల్లని మచ్చలతో చూపరుల్ని ఆకర్షిస్తుంటుంది. దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాల్లో విహరించే ఎకిడ్నా పంక్టాటా రకమైతే, నల్లని ఆకాశంలో తళుకులీనే తారలు పరచుకున్నట్లే ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించే ఐడియా ల్యూకొనె కూడా తెలుపు రంగు మీద నల్లని చుక్కలతో అందాలవిందు చేస్తుంటుంది.
*అక్షరాలా 88
మధ్య, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో అరుదుగా కనిపించే డయాత్రియా అన్నా రకం సీతాకోకచిలుక మరో వింతని ప్రదర్శిస్తుంటుంది. దాని రెక్కల మధ్యలోని గీతలు అచ్చం 88 అంకెను పోలి ఉండటంతో ఇది అన్నాస్‌ 88గా పేరొందింది. వీటిల్లోని కొన్ని రకాలమీద 89 అంకె కూడా ఉంటుందట. ఈ అంకెల బటర్‌ఫ్లైలను చూడటం అదృష్టంగా భావిస్తారు స్థానికులు.
*అలా ఎలా ప్రయాణిస్తున్నాయి?
పసుపురంగుతో నల్లని చారలూ చుక్కలతో ఉండే మోనార్క్‌ సీతాకోకచిలుకంటే ఉత్తర అమెరికన్లకి ఎంతో ఇష్టం. మిల్క్‌వీడ్‌ మొక్కలమీద సందడి చేస్తూ ఎగురుతుండే ఇవి, చలికాలంలో మాయమై, మళ్లీ ఎండాకాలంలో ప్రత్యక్షమయ్యేవట. ఆ కాలంలో చనిపోతున్నాయని మొదట్లో భావించినా తరవాత వాటి గురించి పరిశీలించగా అవన్నీ చలికి తట్టుకోలేక మెక్సికోకి వలసబాట పడుతున్నాయని తేలింది. అంటే సుమారు 3,000 మైళ్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని వేల కిలోమీటర్లు దారి తప్పకుండా అదే ప్రదేశానికి ఎలా ప్రయాణించగలుగుతున్నాయని గత ఇరవయ్యేళ్లుగా పరిశీలిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు. వాటి యాంటెన్నాల్లోని జీవ గడియారం సూర్యగమనాన్ని పసిగడుతోందనీ దాని ఆధారంగానే అవి రాత్రివేళలో విశ్రాంతి తీసుకుంటూ పగటివేళలో ప్రయాణిస్తూ సురక్షితంగా అడవులకు చేరుకోగలుగుతున్నాయని చెబుతున్నారు. ఆగస్టులో మొదలైన వీటి ప్రయాణం నవంబరు వరకూ సాగుతుంది. ఆ సమయంలో మెక్సికోలోని ఒయోమెల్‌ ఫిర్‌ చెట్లన్నీ లక్షలకొద్దీ మోనార్క్‌లతో నిండిపోతాయి. తమను పలకరించే ఈ అతిథులకోసం ఆ అడవుల్ని సుమారు లక్షన్నర ఎకరాలకు విస్తరింపజేసి, వాటి రక్షణ కోసం రక్షణ దళాల్నీ నియమించింది మెక్సికో ప్రభుత్వం. అయినప్పటికీ వాతావరణ మార్పులు, క్రిమిసంహారకాల వాడకంతో మోనార్క్‌ గొంగళిపురుగులు తినే మిల్క్‌వీడ్‌ మొక్కలు చనిపోవడం… వంటి కారణాలతో వీటి సంఖ్య ఏటికేడాదీ తగ్గిపోతుండటం దురదృష్టకరం.
*మాయ చేసేస్తాయి!
సృష్టిలోని ప్రాణుల్లో కొన్ని తమ శత్రువుల నుంచి కాపాడుకునేందుకు చుట్టుపక్కల వాతావరణాన్ని పోలిన రంగుల్లో ఉండటం, ఇతర జీవుల్ని అనుకరించడం, అవసరాన్ని బట్టి రంగులు మార్చుకోవడం… ఇలా ఆత్మరక్షణకోసం రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తాయి. ఆ విద్యలన్నీ సీతాకోకచిలుకలకీ తెలుసు. ఆరెంజ్‌ డెడ్‌లీఫ్‌ బటర్‌ఫ్లైగా పిలిచే కలిమా ఇనాకస్‌, శాటర్న్‌ రకాలు అచ్చం ఎండుటాకుల్ని పోలినట్లుగా మిమిక్రీ చేస్తే, గ్రీన్‌హెయిర్‌ స్ట్రీక్‌గా పిలిచే కాలోఫ్రిస్‌ రుబి తన ఉనికి బయటపడకుండా పచ్చని ఆకులా కనిపిస్తుంది. ఇక, కాలిగొ ఇడొమెనియస్‌ అయితే గుడ్లగూబలాంటి కళ్లనూ పామును పోలిన రెక్కలతో మరేప్రాణీ దగ్గరకు రాకుండా భయపెడుతుంది. కోడి కళ్లతో ఉండే బక్‌ ఐ బటర్‌ ఫ్లై, జీబ్రా చారలతో పక్షితోకని తలపించే స్వాలో టెయిల్‌ సీతాకోకచిలుకా… ఇలా చాలానే ఉన్నాయి. సీతాకోకచిలుకలే కాదు, వీటి పూర్వికజాతి అయిన కొన్ని మాత్‌లు కూడా అద్భుతమైన మిమిక్రీ చేస్తాయి. బ్రాహ్మయా వాలిచి, ఎరిబస్‌ వాకరి రకాలు అచ్చం గుడ్లగూబల్ని తలపిస్తే, అటాకస్‌ అట్లాస్‌ రెక్కల అంచులు పాముల్ని తలపిస్తూ భయపెడతాయి.