Devotional

దొంగిలించిన పూలతో పూజ చేస్తే…

దొంగిలించిన పూలతో పూజ చేస్తే…

దొంగతనపు పూలతో పూజ చేస్తే పుణ్యం వస్తుందా…?

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెళ్తూ, దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా…. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే…

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్ధించి, కొన్ని పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి, బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం…

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి…

శ్లో౹ తాంబూల ఫల పుష్పాది హర్తాస్యాత్ వానరో వనే ! ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం )

తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతి గాను;
పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించిన వాడు మేక గానూ పుట్టుచుందురు…

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు….

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజలవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగా పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా… ఆలోచించండి, తెలియనివారికి తెలియచేయండి.