NRI-NRT

అమెరికా కంపెనీలపై నిషేధం దిశగా చైనా

China Now Aiming To Ban American Companies

అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు మరో కీలక మలుపు తీసుకుంది. ఇంతవరకు తమ సంస్థలపై నిషేధం విధిస్తూ వస్తున్న అగ్రరాజ్యానికి తగిన జవాబు ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. హువాయి తదితర సంస్థలు, టిక్‌టాక్‌ వంటి యాప్‌లపై పలు ఆంక్షలు విధించిన అమెరికా నిర్ణయానికి ప్రతి చర్యగా చైనా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో నమ్మదగని సంస్థల జాబితాను సిద్ధం చేస్తున్నామంటూ చైనా ప్రకటించింది. ఆ దేశ వాణిజ్య శాఖ చేసిన ప్రకటనలో ప్రత్యేకించి ఏ విదేశీ సంస్థ ప్రస్తావన లేనప్పటికీ.. వీటిలో విదేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు, ఇతర కార్యాలయాలు కూడా ఉండవచ్చని ప్రకటించింది. ఆయా సంస్థలపై తీసుకునే చర్యలలో జరిమానాలు మాత్రమే కాకుండా విదేశీ వాణిజ్యం, చైనాలో పెట్టుబడులు, సిబ్బంది, పరికరాల ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు తదితర అంశాలు ఉండవచ్చని ఆ శాఖ ప్రకటించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినట్టు తెలిస్తే ప్రభుత్వం ఆ సంస్థపై విచారణకు ఆదేశిస్తుందని తెలిపింది. అది విదేశీ సంస్థ అయితే దానికి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తామని కూడా చైనా వివరించింది. కరోనా వైరస్‌ సంక్షోభానికి చైనాయే కారణమని నమ్ముతున్న అమెరికా, ఆ దేశంపై పలు ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో ట్రంప్‌ ప్రభుత్వం నిషేధం ప్రకటించిన చైనా సంస్థల్లో .. హువావే, జెడ్‌టీఈ తదితర సాంకేతిక దిగ్గజాలు, టిక్‌టాక్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. వీటి నుంచి భద్రతా పరమైన ముప్పు ఎదురవుతోందంటూ అమెరికా వెల్లడించింది. తాజాగా శుక్రవారం టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే చైనాపై మరిన్ని చర్యలు తప్పవంటూ అమెరికా సంకేతాలివ్వడంతో.. చైనా ఎదురుదాడికి దిగింది. తమ కంపెనీల ప్రయోజనాలను కాపాడటం కోసం అవసరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, అభివృద్ధి ప్రయత్నాలకు ఆటంకం కలిగించేవి.. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉండే సంస్థలు, వాటి చర్యలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చైనా వెల్లడించింది. కాగా, అమెరికాకు చెందిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ వంటి దిగ్గజ సాంకేతిక, సామాజిక సంస్థలను చైనా తమ దేశంలో ఇప్పటివరకూ కాలుపెట్టనివ్వకపోవటం గమనార్హం.