Business

40 నూతన క్లోన్ రైళ్లు-వాణిజ్యం

Latest Telugu Business News - New 40 Clone Trains By Indian Railways

* దేశంలో క్లోన్ రైళ్లను ఈ నెల 21 నుంచి నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.ఈ క్లోన్ రైళ్లకు 10 రోజులకు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వీలుంటుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ క్లోన్ రైళ్లకు హాల్టింగులు తక్కువగా ఉంటాయి.క్లోన్ రైళ్లు అంటే ఏంటి ?క్లోన్ రైలు అనేది అసలు రైలు నెంబర్ లో నడిచే మరో రైలు.ఒక రైలులో రిజర్వేషన్ పూర్తిగా నిండిపోయి, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉంటే.. వెయిటింగ్ లో ఉన్న ప్రయాణికులను మరో రైలులో తరలిస్తారన్నమాట.దీనిపై ప్రయాణికులకు ముందుగానే రైలుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు చేరవేస్తారు.ఒరిజినల్ రైలు రిజర్వేషన్ల ఛార్టుతో పాటే క్లోన్ రైలు రిజర్వేషన్ కూడా ఒకేసారి పూర్తి చేయనున్నారు.

* ఫ్యాన్లపై జీఎస్టీని తగ్గించాలని దేశీయ ఫ్యాన్ల తయారీదారులు కోరుతున్నారు.ప్రస్తుతం ఫ్యాన్లపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా, దీనిని 5 శాతానికి తగ్గించాలని దేశీయ ఫ్యాన్ల తయారీదారుల అసోసియేషన్‌ ఒక ప్రకటనలలో కోరింది.కరోనా కారణంగా ఈ ఏడాది ఫ్యాన్ల అమ్మకాలు 35 శాతం పడిపోవడంతో ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వచ్చిందని ఐఎఫ్‌ఎంఏ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ తెలిపారు.

* ఎయిరిండియా ప్రైవేటీకరణ మరికొంత కాలం ఆలస్యం అయ్యే అవకాశముందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కొవిడ్‌ దుర్భర పరిస్థితులు సర్దుమణిగే వరకు వేచి ఉండి, సామర్థ్యం కలిగిన మరికొందరు కొనుగోలుదార్లను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందుకోసం ఎయిరిండియా రుణంలో మరికొంతమొత్తాన్ని కూడా తొలగించి, ప్రభుత్వమే వహిస్తుందని పేర్కొన్నారు. బిడ్ల దాఖలుకు కూడా మరికొంత సమయం ఇచ్చే అవకాశముందని తెలిపారు.

* భారత్‌లో పబ్లిక్‌ క్లౌడ్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందవచ్చని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. 2019-20లో రూ.17,000 కోట్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2024-25 కల్లా రూ.63,000 కోట్లకు చేరొచ్చని ఒక నివేదికలో నాస్‌కామ్‌ తెలిపింది. 2025 కల్లా చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు (ఎస్‌ఎమ్‌బీలు) క్లౌడ్‌ మార్కెట్లో 28-30 శాతం మేర వాటాను కలిగి ఉంటాయని అంటోంది. 1000 ఎస్‌ఎమ్‌బీలపై జరిపిన సర్వేలో ఇప్పటికే క్లౌడ్‌ను వినియోగిస్తున్నామని 60 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. అయితే దాదాపు సగం సంస్థలు ఇంకా ప్రారంభ దశ వినియోగంలోనే ఉన్నాయి. క్లౌడ్‌ను అందిపుచ్చుకున్న అత్యుత్తమ ఎస్‌ఎమ్‌బీల్లో 25-30 శాతం ఉత్పాదకత పెరిగిందని.. 15-20 శాతం మేర నిర్వహణ వ్యయాలు తగ్గాయని ఆ సర్వేలో తేలింది. భద్రత, అనలిటిక్స్‌, ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌.. ఈ మూడు ప్రధాన కారణాల వల్ల కంపెనీలు క్లౌడ్‌కు మళ్లుతున్నట్లు తెలిసింది. అయితే యాజమాన్య మద్దతు, నైపుణ్యం, మూలధనం లేకపోవడం వంటివి క్లౌడ్‌ను అందిపుచ్చుకోవడానికి ఎదురవుతున్న ప్రధాన సమస్యలని 50 శాతం పైగా కంపెనీలు అభిప్రాయపడ్డాయి. మరో పక్క, క్లౌడ్‌ ఉన్న ఎస్‌ఎమ్‌బీలు ఈ కరోనా సమయంలో నిలబడ్డాయని.. స్వల్పకాలంలోనే ఆదాయాలను మళ్లీ గాడిలో పెట్టుకోగలిగాయని నాస్‌కామ్‌ వివరించింది.

* వ్యాపార, రవాణా సంస్థలు ఆగస్టులో 4.87 కోట్ల ఇ-వేబిల్లులను తీసుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.13.85 లక్షల కోట్లు అని జీఎస్‌టీఎన్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అంతరాష్ట్ర సరకు రవాణా విలువ రూ.50,000 మించితే తప్పక ఇ-వేబిల్లును తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరిగే సరకు రవాణాకు ఈ పరిమితి విషయంలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉంది. జీఎస్‌టీఎన్‌ గణాంకాల ప్రకారం.. జులైలో 4.76 కోట్ల ఇ-వేబిల్లులు తీసుకోగా, వీటి మొత్తం విలువ రూ.13.66 లక్షల కోట్లు. జూన్‌లో 4.27 కోట్లు (విలువ రూ.12.40 లక్షల కోట్లు), మేలో 2.51 కోట్లు (రూ.8.98 లక్షల కోట్లు), ఏప్రిల్‌లో 84.53 లక్షలు (రూ.3.9 లక్షల కోట్లు), మార్చిలో 4 కోట్లు (రూ.11.43 లక్షల కోట్లు) చొప్పున ఇ-వేబిల్లులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఉన్న గణాంకాల ప్రకారం చేస్తే.. ఆర్థిక ప్రగతి పుంజుకుంటోందనే విషయం అర్థమవుతోంది. నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఇ-వేబిల్లు పోర్టల్‌ నుంచి నెల రోజుల కాలానికి ఇ-వేబిల్లుల వివరాలను వ్యాపారాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జీఎస్‌టీఎన్‌ తెలిపింది. ఇంతకుముందు 5 రోజులవి మాత్రమే ఇ-వేబిల్లుల వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుండేది.