Business

భారతదేశంలో పెట్రోల్ గిరాకీ తగ్గుతుంది-వాణిజ్యం

భారతదేశంలో పెట్రోల్ గిరాకీ తగ్గుతుంది-వాణిజ్యం

* భారత్‌లో ఈ ఏడాది ఇంధన గిరాకీ 11.5 శాతం మేర క్షీణించవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. 2020-21లో భారత వాస్తవ జీడీపీ -4.5 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలను కాస్తా -8.6 శాతానికి ఆర్థికవేత్తలు సవరించడం ఇందుకు నేపథ్యం. అంతక్రితం ఇంధన గిరాకీ వృద్ధి అంచనా -9.4 శాతంగా ఉంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 31నే ఎత్తివేసినా.. రాష్ట్ర స్థాయిలో కొన్ని చోట్ల నిబంధనలు కొనసాగుతుండడం ఆర్థిక రికవరీని ఆలస్యం చేస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. అటు వినియోగదారు, ఇటు పరిశ్రమ స్థాయిల్లో ఇంధనానికి గిరాకీ తగ్గుతున్నట్లు కనిపిస్తోందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది.

* ఈక్విటీ షేర్ల జారీ సహా వివిధ పద్ధతుల ద్వారా రూ.8,000 కోట్ల నిధులను సమీకరించుకోవడానికి వాటాదార్ల అనుమతులు దక్కినట్లు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. శనివారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌)లో వాటాదార్లు అనుమతిచ్చినట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో పేర్కొంది.

* పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభానికి ముందు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లకు పైగా నిధులను క్యామ్స్‌ (కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) సమీకరించింది. 35 యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ.1,230 చొప్పున 54,19,230 షేర్ల కేటాయింపును ఖరారు చేసినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఈ విలువ ప్రకారం చూస్తే.. కంపెనీకి రూ.666.56 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉంది. ఈ 35 యాంకర్‌ ఇన్వెస్టర్లలో 17 విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు, 13 మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, మూడు బీమా కంపెనీలు, రెండు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్‌. కాగా.. మ్యూచువల్‌ ఫండ్స్‌కు రిజిస్ట్రార్‌, ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌గా (ఆర్‌టీఏ) వ్యవహరించనున్న క్యామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం (21న) ప్రారంభమై 23న ముగియనుంది. ఈ ఇష్యూకు రూ.1,229- 1,230ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ప్రతిపాదిత ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,242 కోట్ల మేర సమీకరించే అవకాశం ఉంది.

* వొడాఫోన్‌ ఐడియా తన ప్రీపెయిడ్‌ వినియోగదార్లకు జీ5 వీడియో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫాంను అందిస్తోంది. ఏడాదిపాటు ఎటువంటి చందా కట్టకుండానే పొందగలిగేందుకు అవకాశం కల్పించింది. రూ.355, రూ.405, రూ.595, రూ.795, రూ.2,595తో డేటా ప్లాన్లను రీఛార్జి చేసుకున్న వారికి వార్షిక జీ5 సభ్యత్వం లభిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

* ‘ఖాదీ’ బ్రాండ్‌ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్న 160కు పైగా వెబ్‌లింక్‌లను తొలగించాలంటూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఇ-కామర్స్‌ పోర్టల్‌లను ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కేవీఐసీ) కోరింది. ఖాదీ ఇండియా పేరిట ఉత్పత్తులను విక్రయిస్తున్న 1000కి పైగా కంపెనీలకు లీగల్‌ నోటీసులను కేవీఐసీ పంపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో ఇలా నకిలీ ఖాదీ ఉత్పత్తులను విక్రయిస్తున్న చాలా వరకు స్టోర్లు మూతపడ్డాయి కూడా.