DailyDose

రైతు బిల్లుకు రాజ్యసభ ఓకే-తాజావార్తలు

Rajyasabha Approves New Agriculture Bill-Telugu Latest Breaking News

* వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులు తాజాగా రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

* రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ తెలిపారు. కాంగ్రెస్‌, తెరాస, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఈ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.

* భారత వ్యవసాయ రంగ చరిత్రలో ఇదో శుభదినం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయానికి సంబంధించిన రెండు కీలక బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తాయని చెప్పారు. అలాగే కోట్ల మంది రైతులకు చేతికి అధికారం వస్తుందని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కీలక బిల్లుల ఆమోదం అనంతరం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

* కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి కచ్చితమైన ఔషధాలు లేకుండా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’కి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. భారీస్థాయిలో ప్రజలు వైరస్‌ బారినపడి మరణించే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే రాజ్యసభలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు‌ ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ కోసం రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ వాసి చుక్కాలుగా గుర్తించారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో 9ఎంఎం పిస్తోలుతో పాటు, మరో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో మావోయిస్టు వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

* ఇరాన్‌పై ఉన్న ఐక్యరాజ్య సమితి ఆంక్షలన్నింటినీ పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యని చట్టవిరుద్ధంగా పేర్కొన్న ప్రపంచ దేశాలు ట్రంప్‌ పాలకవర్గంపై పెదవి విరిచాయి. దీంతో త్వరలో జరగబోయే ఐరాస వార్షిక సమావేశాల్లో ఇది చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. 2015లో కుదిరిన ఇరాన్‌ అణుఒప్పందం ప్రకారం ‘జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్’‌(జేసీపీఓఏ)లోని నిబంధనల్ని ఇరాన్‌ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది.

* భారత్‌-నేపాల్‌ మధ్య తొలిసారిగా ప్యాసింజర్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. నేపాల్‌కు ఆధునిక సదుపాయాలున్న రెండు ‘డీజిల్‌-ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌(డీఎంసీయూ)’ రైళ్లను శుక్రవారం భారత్‌ అందజేసింది. బిహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని ధనుసా జిల్లాలోని కుర్తాల మధ్య 35 కిలోమీటర్ల పొడవున తొలిసారిగా నిర్మించిన బ్రాడ్‌ గేజ్‌ రేల్వే మార్గంలో ఈ రైళ్ల రాకపోకలు జరగనున్నాయి.

* రాత్రిపూట నిద్రమేలుకునే వారికి తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. తనకు కూడా చిన్నప్పుడు నిద్రపట్టేది కాదని, ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవని వివరించారు. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన ‘నైట్‌’ అనే అంశంపై మాట్లాడారు. రాత్రి పూట పనులు చేయడం, ఆలోచించడం గురించి ముచ్చటించారు.

* ప్రముఖ చాటింగ్‌ యాప్‌ వాట్సాప్ రోజురోజుకూ కొత్త అప్‌డేషన్స్‌ను యూజర్లకు అందిస్తోంది. వినియోగదారుల సమాచార భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే వాట్సాప్‌ ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సందేశాలను ఇతరులు చూడకుండా యాప్ ఓపెన్ కాకుండా ఉండేందుకు ఫింగర్‌ప్రింట్‌ ద్వారా లాక్‌ చేసుకునేలా యూజర్లకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ను వాట్సాప్‌ వెబ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితోపాటు మరికొన్ని ఫీచర్లను యూజర్లకు వాట్సాప్‌ అందించనుంది.

* పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైకాపా ఎంపీలు ధర్నా నిర్వహించారు. అంతర్వేది ఘటన, అమరావతి భూ కేటాయింపులు, ఫైబర్‌ నెట్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ డిమాండ్‌ చేశారు. వరుసగా మూడో రోజూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు తెలిపింది.

* రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దోహదపడవని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు(కేకే) అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని భాజపా చెప్పగలదా? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఆవరణలో తెరాస ఎంపీలతో కలిసి కేకే మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. భాజపాకు బలం లేని రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదింపజేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 60 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ బిల్లుల ఆమోదం జరగలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని భాజపా చూస్తోందని విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను నిబంధనలకు వ్యతిరేకంగా డిప్యూటీ ఛైర్మన్‌ తోసిపుచ్చారన్నారు.

* వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ది చెబుతారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా తెదేపా నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్వార్థంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా నష్టం లేదన్నారు. నాయకులు వస్తారు.. పోతారు. పార్టీ, కార్యకర్తలే శాశ్వతమన్నారు. కార్యకర్తల అభిమానం, ప్రజాదరణ తెలుగుదేశం సొంతమని, జెండాను మోసి గిలిపించేది కార్యకర్తలేనన్నారు. వైకాపా అవినీతి, అరాచకాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైపల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే పార్టీ ఫిరాయింపులను సీఎం ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైకాపా కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, డివిజన్‌ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

* పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు వైకాపా ఎంపీలు ధర్నా నిర్వహించారు. అంతర్వేది ఘటన, అమరావతి భూ కేటాయింపులు, ఫైబర్‌ నెట్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ డిమాండ్‌ చేశారు. వరుసగా మూడో రోజూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా మద్దతు తెలిపింది. బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చినచోట పంట అమ్ముకోవడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.