Agriculture

మష్రూం గార్ల్ ఆఫ్ ఇండియా – దివ్యా

Telugu Agricultural News - Mushroom Girl Of India Divya From Uttarakhand

డబ్బు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కండ్లు కాయలయ్యేలా ఎదురుచూసి రావడంలేదని నిట్టూర్చేకన్నా మనకు ఇష్టమైన ఏదో ఒక పనిలో ఆనందం వెతుక్కోవడమే కాకుండా వేలకు వేలు కూడా సంపాదించుకోవచ్చు అని నిరూపించింది ఉత్తరాఖండ్‌కు చెందిన యువతి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇతర ప్రాంతాలకు వలస వెల్లడం కన్నా తానుంటున్న ప్రాంతంలోనే ఏదో ఒకటి చేయాలనుకుని పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టింది. సొంతంగా ల్యాబ్ ఏర్పాటుచేసుకుని కొత్త వంగడాలను తయారుచేస్తూ మార్కెట్ కు పరిచేయం చేస్తున్నారామె.

ఉత్తరాఖండ్‌కు చెందిన 22 ఏండ్ల దివ్య రావత్.. ఉన్నతాభ్యాసం కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడ అమిటీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివింది. అనంతరం అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో రూ.25 వేల జీతానికి ఉద్యోగం చేశారు. ఒకదాని తరువాత ఒకటి ఎనిమిది ఉద్యోగాలు మారినా ఎక్కడ కూడా ఆమె సంతృప్తి చెందలేదు. భిన్నంగా ఏదైనా చేయాలనే కోరిక ఆమెను తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చేలా చేసింది. 2013 లో ఆమె ఉత్తరాఖండ్‌కు తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస వెళ్ళడం గమనించింది. తాను అలా వలస వెళ్లకుండా మరికొందరిని వలస నుంచి తప్పించేందుకు పుట్టగొడుగుల పెంపకం చేపట్టింది. పుట్టగొడుగులపై విశేష పరిశోధనలు ఒకవైపు చేస్తూనే.. మరోవైపు గ్రామాల్లోని మహిళలను ఒక గొడుగు కిందకు తీసుకురావడం, వారిలో మార్పు తీసుకురావడానికి చాలా కష్టపడింది. 2015 లో పుట్టగొడుగుల సాగులో శిక్షణ తీసుకుని రూ.3 లక్షల పెట్టుబడితో పెంపకం చేపట్టింది. గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని మహిళలను తన సాగులో భాగస్వాములుగా చేసి మరింత ఎక్కువ పుట్టగొడుగులు పెంచుతున్నది. అలా ఉత్తరాఖండ్‌లోని 10 జిల్లాల్లో 55 యూనిట్లను ఏర్పాటుచేసి వందలాది మందికి ఉపాధి చూపిస్తున్నారు.

తక్కువ వ్యవధిలోనే దివ్య రావత్ మష్రూమ్ సాగు రంగంలో ప్రసిద్ధి చెందింది. ‘మష్రూమ్ గర్ల్’ పేరుతో పిలువబడే దివ్యను ఉత్తరాఖండ్ ప్రభుత్వం పుట్టగొడుగుల బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. ప్రస్తుతం దివ్య పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఏటా రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. ‘పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్నాను ఎందుకంటే మార్కెట్ సర్వేలో కూరగాయల కన్నా పుట్టగొడుగుల ధరలు మంచివని తేలింది. ఒక కిలో బంగాళాదుంప ఎనిమిది నుంచి పది రూపాయలు ఉండగా.. పుట్టగొడుగు కనీస ధర కిలోకు రూ.100. అందుకని పుట్టగొడుగులను పండించాలని నిర్ణయించుకున్నాను అని దివ్య రావత్ తెలిపారు.

ప్రస్తుతం దివ్య కోట్లాది రూపాయల వార్షిక టర్నోవర్ ఉన్నసౌమ్య ఫుడ్ ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నది. ఏడాది పొడవునా పుట్టగొడుగుల సాగు చేపడుతూ స్థానిక మహిళలు ఎంతో కొంత సంపాదించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. శీతాకాలంలో బటన్, మధ్య సీజన్లో ఓస్టెర్, వేసవి కాలంలో మిల్కీ పుట్టగొడుగులను పండిస్తుంటారు. వీటితో పాటు హిమాలయ ప్రాంతంలో కనిపించే కార్డిసెఫ్ మిలిటరీస్ అనే జాతి పురుగును మార్కెట్లో కిలోకు రూ.2 నుంచి 3 లక్షలకు అమ్ముతుంటారు. వాణిజ్య సాగు కోసం దివ్య ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసి మరిన్ని కొత్త వంగడాలను మార్కెట్ కు అందించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. సామాన్యుల ఆహారంలో పుట్టగొడుగులను చేర్చేలా పాటుపడుతున్న దివ్య రావత్ ఆశయాలు ఫలించాలని ఆకాంక్షిద్దాం.