DailyDose

UCLA నుండి శుభవార్త-TNI కరోనా బులెటిన్

UCLA Announces New Treatment With 4-PBA

* కరోనావైరస్‌ వల్ల కలిగే తీవ్ర పరిణామాలను నివారించడంతో పాటు వైరస్‌ తీవ్రతను తగ్గించే సామర్థ్యమున్న మరో చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌(UCLA) కు చెందిన పరిశోధకులు 4-ఫినైల్‌ బ్యూటిరిక్‌ యాసిడ్‌(4-PBA)ఔషధంపై విశ్లేషణ జరిపారు. తొలుత జంతువుల్లో దీన్ని ప్రయోగించి.. కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో సెల్యులార్‌ స్ట్రెస్‌ ఎంతో కీలకమని తేల్చారు. తాజాగా దీన్ని తగ్గించడంలో మెరుగైన ఫలితాలు రావడంతో కరోనా చికిత్సకు మరో ముందడుగు పడినట్లు నిపుణులు భావిస్తున్నారు.

* కరోనా కాలంలో బయటి నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, వస్తువులు, పరికరాలను శానిటైజ్‌ చేసేందుకు యూవీ(అల్ట్రా వైలెట్‌) కాంతి చాలంటున్నారు రూరల్‌ ఇన్నోవేటర్‌ నరసింహాచారి. యూవీ కాంతి సహాయంతో కేవలం 15 సెకన్లలో కరోనా వైరస్‌ను నశింపజేసే యూవీసీ పరికరాన్ని నిజామాబాద్‌లోని నవీపేటకు చెందిన నరసింహాచారి కనుగొన్నారు. ఆ పరికరానికి సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)తోపాటు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) కూడా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం అనుమతిస్తే తక్కువ ఖర్చుకే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని పేర్కొంటున్నారు.

* కరోనా హాట్‌స్పాట్‌గా మారిన కోయంబేడు మార్కెట్‌ మళ్లీ తెరచుకోనుంది. ఈ నెల 28 నుంచి షాపులు తెరచేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులిచ్చారు. ఈ మార్కెట్లో దాదాపు 3000 వరకు దుకాణాలు ఉండగా… తొలివిడతలో 300 దుకాణాలు తెరుస్తారు. విడతల వారీగా తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా ప్రభావానికి ముందు కనీసం రోజుకు లక్ష మంది ఈ మార్కెట్‌కు వచ్చేవారు. ఈ మార్కెట్‌ కారణంగా దాదాపు 3,000 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు అంచనా వేశారు.

* రష్యాలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ దేశంలో కొత్తగా 6,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 79 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా 19,418 మంది మృతి చెందారని ఆ దేశ కరోనా ప్రతిస్పందనా కేంద్రం తెలిపింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో 1,397 మందికి ( 22.7శాతం) ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. శుక్రవారం కరోనాతో 144 మంది మృతి చెందారు.

* కోవిడ్‌-19 కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం రాష్ర్టంలోని 11 జిల్లాల ప్ర‌ధాన కేంద్రాల్లో 144 సెక్షన్‌ను విధించింది. రాజ‌ధాని న‌గ‌రం జైపూర్‌తో పాటు జోద్‌పూర్‌, ఉద‌య్‌పూర్‌, కోటా త‌దిత‌ర జిల్లా కేంద్రాల్లో 144 సెక్ష‌న్‌ను విధించింది. దీంతో ఏ ఒక్క ప్ర‌దేశంలో ఐదుగురికి మించి వ్య‌క్తులు గూమికూడ‌వ‌ద్దు. అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ఎటువంటి మ‌త‌, సాంఘీక కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తిని నిరాక‌రించింది. సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ రోగులు, వారి కుటుంబ స‌భ్యుల స‌హాయం నిమిత్తం ప్ర‌భుత్వం రేప‌టి నుంచి 24 గంట‌ల పాటు సేవ‌లు అందించే 181 హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంల‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ర్టంలో నిన్న కొత్త‌గా 1,834 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్‌-19తో నిన్న 14 మంది చ‌నిపోయారు. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,13,124 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 1322 మంది క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృత్యువాత‌ప‌డ్డారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.