Business

ఆలీబాబా సర్వర్లలో భారతీయుల సమాచారం-వాణిజ్యం

Business News Roundup - Indians Stolen Data Saved In Alibaba Servers

* కలర్‌ ప్రిడిక్షన్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌ ముసుగులో చైనీయులు లక్షల మంది భారతీయుల డాటాను చోరీచేశారు. బెట్టింగ్‌ గేమ్‌లే కాదు.. డేటింగ్‌ సైట్స్‌.. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌లకు సంబంధించిన డాటాను సైతం కొల్లగొట్టారు. భారతదేశంలో తమ సంస్థలను ఏర్పాటుచేసిన చైనా.. ఒకపక్క ఆర్థికంగా.. మరోపక్క దేశ ప్రజల రహస్య సమాచారాన్ని సేకరించింది. ఆ డాటా అంతా అలీబాబా సర్వర్లలో దాచిపెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టిన తాజా దర్యాప్తులో చైనా సంస్థల కుట్ర బట్టబయలైంది. అలీబాబా 40 దొంగల కథల తరహాలో.. కలర్‌ ప్రిడిక్షన్‌ పేరుతో ఢిల్లీ కేంద్రంగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తూ అమాయకులను మోసగించిన చైనాకు చెందిన యా హవోతోపాటు గురుగావ్‌వాసులు ధీరజ్‌సర్కార్‌, అంకిత్‌కపూర్‌, నీరజ్‌తులీలను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గతనెలలో అరెస్టుచేశారు.

* బకాయిల వసూలు కంటే వ్యాపారాన్ని నిలబెట్టడమే చాలా ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శనివారం రాజ్యసభలో దివాలా చట్టం (ఐబీసీ) 2020 (రెండో సవరణ) బిల్లును వాయిస్‌ ఓటుతో ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. దివాలా ప్రక్రియ ద్వారా 258 సంస్థలను కాపాడగలిగామని, 965 సంస్థలు నగదీకరణకు వెళ్లాయని తెలిపారు.

* జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌…దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘ఆర్‌18 మోడల్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రూజర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడంలో భాగంగా విడుదల చేసిన ఈ బైకు రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో లభించనున్నది. ఈ బైకు కావాలనుకునేవారు శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ అవుట్‌లెట్లలో ముందస్తుగా ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 1,802 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైకులో ఆరు గేర్లు ఉన్నాయి.

* ఈ ఏడాది చమురుకు డిమాండ్‌11.5 శాతం పడిపోనున్నదని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనావేస్తున్నది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో నాలుగు నెలలపాటు చమురు వినిమయం భారీగా పడిపోయిందని, ఇప్పుడిప్పుడే మళ్లీ యథాతథ స్థితికి వచ్చిందని పేర్కొంది. అలాగే 2020-21లో దేశ జీడీపీ 8.6 శాతానికి పడిపోనున్నదని తెలిపింది. దేశవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ పడిపోయిందని, ముఖ్యంగా వినియోగదారులు, పరిశ్రమల నుంచి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని ఫిచ్‌ విశ్లేషించింది. ఈ మహమ్మారితో లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, మరోవైపు ఆదాయం అంతకంతకు తగ్గడంతో క్రమంగా ఖర్చులు తగ్గంచుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది.

* అమెరికాలో అమెజాన్ లంచం కేసులో భారత జాతీయుడు సహా ఆరుగురిపై ఆరోపణలు వచ్చాయి. అన్యాయమైన పోటీ ప్రయోజనం కోసం ఉద్యోగులు.. అమెజాన్ కాంట్రాక్టర్లకు వాణిజ్య లంచంగా 1,00,000 డాలర్లను చెల్లించడానికి కుట్ర పన్నారని శుక్రవారం అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. అభియోగాలు మోపిన నిందితుల్లో హైదరాబాద్ కు చెందిన నిషాద్ కుంజుతోపాటు కాలిఫోర్నియాకు చెందిన రోహిత్ కడిమిశెట్టి ఉన్నారు.