DailyDose

120కోట్ల రష్యా టీకాలకు ఆర్డర్లు-TNI బులెటిన్

Russian COVID19 Vaccine Gets 120Cr Order

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌కు భలే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం మూడోదశ ప్రయోగాల్లో ఉన్న రష్యా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-V’ కోసం దాదాపు 20దేశాల నుంచి 100కోట్ల డోసులకుపైగా కోసం వినతులు వచ్చినట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్‌ కోసం పది దేశాలు ఒప్పంద దశకు చేరుకోగా, ఇప్పటివరకు దాదాపు 120కోట్ల డోసుల కోసం వినతులు వచ్చినట్లు సమాచారం. తొలి, రెండోదశ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉందని నివేదికలు వెల్లడించడంతో ఈ వ్యాక్సిన్‌ కోసం పలుదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోనూ 10కోట్ల డోసులను సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో రష్యా వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

* దేశంలో కరోనా ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా మరో 86,961 కేసులు, 1130 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు, మరణాల్లో అత్యధికం కేవలం పది రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. నిన్న దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్‌ మరణాల్లో 86శాతం కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 455 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (101), ఉత్తర్‌ప్రదేశ్ (94)‌, పశ్చిమబెంగాల్‌ (61), తమిళనాడు (60), ఆంధ్రప్రదేశ్‌ (57)‌, పంజాబ్‌ (56), దిల్లీ (37), హరియాణా (29), మధ్యప్రదేశ్‌ (27) చొప్పున కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87,882 మంది మరణించగా.. మరణాల రేటు 1.6శాతంగా ఉంది.

* లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ అనేక జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకున్నదని, వైరస్‌ కట్టడి విషయం లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తక్కువ మరణాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. ఆదివారం లోక్‌సభలో కరోనాపై జరిగిన చర్చలో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, వైద్య, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ విమానాలను నిలిపివేయాలని ప్రధానమంత్రికి మొదట సూచించింది సీఎం కేసీఆర్‌ అని గుర్తుచేశారు. దేశంలోనే మొదట లాక్‌డౌన్‌ తెలంగాణలో విధించారని, బతికుంటే బలుసాకు తినవచ్చని సీఎం కేసీఆర్‌ చెప్పి అనేక జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకున్నారని రంజిత్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో 634 కేంద్రాల ద్వారా 1.56కోట్ల మందికి ఉచిత భోజన వసతిని కల్పించినట్టు చెప్పారు.

* కరోనా వైరస్ కు గురైన మానవులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్స చేయడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెలలో 26 మంది వైరస్ కు గురైన రోగులను విచారించనున్నారు. వ్యాప్తిని తగ్గించడం, రోగుల పరిస్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోస్టారికా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం.. ట్రయల్స్ ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నట్లుగా రుజువైనపక్షంలో దవాఖానల్లో పెద్ద ఎత్తున చికిత్స చేసే అవకాశాలు ఉంటాయి.