Health

అల్జీమర్స్‌ను అడ్డుకునేది ఎలా?

అల్జీమర్స్‌ను అడ్డుకునేది ఎలా?

అల్జీమర్స్ అంటే మతిమరుపు. ప్రస్తుత కరోనా కాలంలో ఎవరైనా ఈ వ్యాధితో పోరాడుతుంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కరోనా వైరస్ మెదడుపై ప్రభావం చూపి రక్తస్రావం, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయేట్లుగా చేయవచ్చు. రెండవది, అల్జీమర్స్ రోగులు ఒంటరిగా ఉండటం వలన వారి పరిస్థితి మరింత దిగజారిపోతుందని న్యూరాలజిస్టులు చెప్తున్నారు. కరోనాతో ఒంటరిగా ఉండాల్సి వస్తుండటం వల్ల జ్ఞాపకశక్తి మరింత బలహీనపడుతుంది. అల్జీమర్స్ అనేది మెదడు కణాలను నాశనం చేసే న్యూరోలాజికల్ డిజార్డర్. దీనిని వృద్ధాప్య వ్యాధిగా పేర్కొంటుంటారు. ఇది నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. వీరిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గడమే కాకుండా స్వభావం మారుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వయస్సు పెరిగేకొద్దీ ఈ వ్యాధి కూడా పెరుగుతుంది. రోగికి రోజువారీ పనులు చేయడంలో చాలా సమస్యలు వస్తాయి. ఈ వ్యాధికి గురైన వారు.. తెలిసిన వారిని కూడా వింతగా చూస్తారు. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు నాకెప్పుడిచ్చావ్ అని వాదిస్తుంటారు. టిఫిన్ తిన్నా నాకెప్పుడు పెట్టారని విసుగుచెందుతాడు. ఈ వ్యాధి సాధారణంగా 70 ఏండ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది.

*** కరోనా టైంలో గుర్తుంచుకోవాల్సినవి..
అల్జీమర్స్ రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కరోనా కాలంలో వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతుండాలి. వారిని బయటకు రాకుండా చూసుకుంటా, బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తే వారి నుంచి దూరంగా ఉంచడం, భయపడకుండా, ఆందోళన చెందకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధులను ఒంటరిగా ఉండనీయకుండా చూస్తూ వాళ్లు ఏదో వ్యాపకంలో మునిగితేలేలా పనులు చెప్తూ ఉండాలి. అనవసర భయాలకు గురికాకుండా వారితో మాట్లాడుతుండాలి. వారి ఆహారం విషయంలో కూడా జాగ్రత్త పడాలి. నిత్యం 45 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. అధిక కాలరీలు ఖర్చుకావడం వల్ల న్యూరో ట్రాన్సిలేటర్స్‌ పెరిగి మెదడు శక్తిని పుంజుకుంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, మద్యం, సిగరెట్ స్మోకింగ్ ను మానుకోవడం, ఇంటి పట్టు తయారీ ఆహారాలను తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.

*** ఈ వ్యాధి ఎలా వస్తుంది?
శరీరంలోని నరాలు బలహీనపడటం వల్ల రక్తప్రసరణ సకాలంలో జరగక మెదడు చురుగ్గా పనిచేయదు. క్రమేపీ మతిమరుపు వచ్చేస్తుంది. చాలా తక్కువ శాతంలో వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులో కనిపిస్తే అది జెనిటికల్‌గా వచ్చందని భావించ వచ్చు. ఆహార అలవాట్లు, పెరిగిన వాతావరణ ప్రభావం కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చు. ఎక్కువ ఒత్తిడికి గురైనా, ఒంటరితనంగా ఉన్నా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, ఊబకాయం, డయాబెటిస్, తల గాయం, వినికిడి లోపం ఈ వ్యాధి రావడానికి కొన్ని కారణాలు. ఈ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స ఇంకా అందుబాటులో లేదు. లక్షణాల ఆధారంగా మాత్రమే ఈ వ్యాధిని కనుగొనవచ్చు. ఇందుకోసం, మానసిక పరీక్షలు, సిటి స్కాన్లు, ఎంఆర్‌ఐ, దాని వల్ల కనిపించే లక్షణాల వల్ల కలిగే మెదడు మార్పులను పరిశీలించి చికిత్స అందిస్తారు.