Editorials

ఈ సన్యాసులు…వేలకోట్లకు అధిపతులు!

ఈ సన్యాసులు…వేలకోట్లకు అధిపతులు!

సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు. సన్యాసులు సాక్షాత్‌ దైవాంశ సంభూతులు. భక్తజనావళికి వారు ఆధ్యాత్మిక పథనిర్దేశకులు. మోక్షగాములైన సన్యాసులు లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉంటారు. నిరంతర దైవధ్యానమగ్నులై అరిషడ్వర్గాలపై అదుపు కలిగి ఉంటారు…
*సనాతన సంప్రదాయ నియమాల ప్రకారం పైన చెప్పిన మాటలన్నీ సన్యాసులకు చక్కగా వర్తిస్తాయి. అయితే, అవన్నీ ఉత్త సత్తెకాలపు మాటలు. కాలం శరవేగంగా మారుతోంది. కాలంతో పాటే కొందరు సన్యాసులు సైతం అంతకంటే వేగంగా మారుతున్నారు. ఆధ్యాత్మిక సాధనలో వారు ఎంత సమయం గడుపుతున్నారో తెలియదు గాని, లౌకిక వ్యవహారాల్లో మాత్రం నిరంతరం బిజీ బిజీగా జనాలకు కనిపిస్తూనే ఉన్నారు. పీఠాలు, మఠాలనే కాదు, ట్రస్టులు నడుపుతున్నారు, వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో టీవీ చానళ్ల ద్వారా దేశ దేశాల్లోని భక్తజన సందోహాన్ని సమ్మోహితులను చేస్తున్నారు. కొందరు వివాదాలతో వార్తలకెక్కుతున్నారు.
**ఏతావాతా ఈ నయా సర్వసంగ పరిత్యాగులందరూ ఇతోధికంగా ఐహిక భోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. పాపం ఇదంతా భగవంతుని లీలా విలాసంగా తలచిన భక్తజనులు తన్మయత్వంలో ఓలలాడుతూనే ఉన్నారు. మూఢభక్తుల అమాయకత్వం, అజ్ఞానాలే జ్ఞానులైన సన్యాసులకు రక్షణకవచాలు. మన కర్మభూమిలో ఇప్పుడు సన్యాసం ఒక లాభసాటి కెరీర్‌. రాజకీయాల్లాగానే దీనికి కూడా ఎలాంటి విద్యార్హతలతో పనిలేదు. జ్ఞానులైన కొందరు ఈ కిటుకు తెలుసుకునే సన్యాసంలోకి అడుగుపెట్టి కోట్లకు పడగలెత్తారు. మన దేశంలో కోట్లకు పడగలెత్తిన కొందరు సన్యాసులు, వారి వైభోగాలపై ఒక విహంగ వీక్షణం.
***బాబా రామ్‌దేవ్‌
యోగా గురువుగా పరిచయం అక్కర్లేని పేరు బాబా రామ్‌దేవ్‌ది. తన సహచరుడు ఆచార్య బాలకృష్ణతో కలసి ‘పతంజలి’ బ్రాండ్‌ పేరిట వివిధ రకాల ఆయుర్వేద ఉత్పత్తులతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. పతంజలి యోగపీఠం, పతంజలి ఆయుర్వేద సంస్థలతో అంచెలంచెలుగా దేశంలోని వ్యాపార దిగ్గజాలకు దీటుగా ఎదిగాడు. పతంజలి ఆయుర్వేద వ్యాపార వ్యవహారాలను బాబా రామ్‌దేవ్‌ సహచరుడు ఆచార్య బాలకృష్ణ పర్యవేక్షిస్తూ ఉంటాడు. యోగా, ఆయుర్వేదాలకు విస్తృత ప్రచారం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ‘యోగ సందేశ్‌’ మాసపత్రికకు ఆచార్య బాలకృష్ణ ప్రధాన సంపాదకుడు కూడా. పతంజలి ఆయుర్వేద వార్షిక టర్నోవర్‌ దాదాపు రూ.9,500 కోట్లు. బాబా రామ్‌దేవ్‌ నికర విలువ రూ.1500 కోట్లు. ‘పతంజలి ఆయుర్వేద’ ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులనూ విక్రయిస్తోంది. ‘పతంజలి ఆయుర్వేద’ ఉత్పత్తులపైనా, బాబా రామ్‌దేవ్‌పైనా ఎన్ని వివాదాలు ఉన్నా, భక్తుల పుణ్యాన ఈ ఉత్పత్తుల విక్రయాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి.‘కరోనా’ మహమ్మారి కాలంలో దగ్గుమందుకని అనుమతి తీసుకుని ‘కరోనిల్‌’ అనే ఔషధాన్ని కరోనాకు మందుగా మార్కెట్‌లోకి విడుదల చేసినందుకు ‘పతంజలి ఆయుర్వేద’కు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మోసపూరిత ప్రచారంతో ‘కరోనిల్‌’ను మార్కెట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని పలుచోట్ల పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. ఇలాంటి వివాదాలు బాబా రామ్‌దేవ్‌కు కొత్త కాదు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల్లో జంతువులవే కాకుండా, మనుషుల ఎముకల పొడిని కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రచారానికీ, ఉత్పత్తుల నాణ్యతకు పొంతన లేని కారణంగా వినియోగదారుల ఫోరాలు జరిమానాలు విధించిన ఉదంతాలూ ఉన్నాయి.
***ఆశారామ్‌ బాపు
ఒక బాలికపై అత్యాచారం కేసులో ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో యావజ్జీవ ఖైదుగా ఉన్న ఆశారామ్‌ బాపు ఆధ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన కాలంలో దండిగానే సంపాదించాడు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల కాలం తిరుగులేని ఆధ్యాత్మిక గురువుగా చలామణీ అయ్యాడు. బడా బడా రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను పాదాక్రాంతులను చేసుకున్నాడు. దేశ విదేశాల్లో దాదాపు 400 ఆశ్రమాలు, వాటికి తోడుగా 17 వేల బాల సంస్కార కేంద్రాలు నడిపేవాడు. అహ్మదాబాద్‌లో కబ్జా చేసిన స్థలంలో మోతేరా ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సాధుపుంగవునిపై భూకబ్జా కేసులు ఉన్నాయి.ఆశారామ్‌ ఆశ్రమాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు చాలాకాలంగానే ఉండేవి. ఆశ్రమంలో నలుగురు చిన్నారుల మరణంతో ఈ ఆరోపణలు మీడియాలో మిన్నుముట్టాయి. ఆశ్రమాలు, ట్రస్టు ద్వారా ఆశారామ్‌ బాపు వార్షిక టర్నోవర్‌ రూ.350 కోట్లకు పైగానే ఉండేది. అత్యాచారం, హత్య వంటి క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకున్న దరిమిలా ఆశారామ్‌ బాపును ‘అఖిల భారతీయ అఖాడా పరిషద్‌’ దొంగబాబాగా ప్రకటించింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారామ్‌ బాపుతో పాటు అతని కొడుకు నారాయణ సాయికి కూడా రెండేళ్ల కిందట యావజ్జీవ శిక్ష పడింది.
***జగ్గీ వాసుదేవ్‌
జగ్గీ వాసుదేవ్‌ ఆధ్యాత్మిక ప్రవచనాలకు దేశ విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. ఇంగ్లిష్‌ సాహిత్యంలో డిగ్రీ చేసిన ఇతడు పాతికేళ్ల వయసులో ఆధ్యాత్మికమార్గం పట్టాడు. ‘ఈషా ఫౌండేషన్‌’ నెలకొల్పి ‘సద్గురు’గా అవతరించాడు. తొలినాళ్లలో కర్ణాటక–హైదరాబాద్‌ మధ్య మోటార్‌ సైకిల్‌పై తిరుగుతూ ఆదాయం కోసం ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఇందులో ఆదాయం బాగుండటంతో అచిరకాలంలోనే ‘సద్గురు’గా స్థిరపడ్డాడు. జగ్గీ వాసుదేవ్‌ పుస్తకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, యోగా శిబిరాలు, యూట్యూబ్‌లో వీడియోల ద్వారా బాగానే ఆదాయం వస్తోంది. ఐక్యరాజ్య సమితి, బ్రిటన్‌ పార్లమెంటు ఎగువసభ అయిన ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’ సహా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు చేసిన ఘనత ఇతనిది. వివిధ మార్గాల ద్వారా ఈ ‘సద్గురు’నికి వచ్చే ఆదాయం ఏడాదికి దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుంది.
***శ్రీశ్రీ రవిశంకర్‌
‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ గురువుగా శ్రీశ్రీ రవిశంకర్‌ సుప్రసిద్ధుడు. దేశ విదేశాల్లో ఈయనకు భారీ స్థాయిలో భక్తగణం ఉన్నారు. బెంగళూరులోని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సెంటర్‌’తో పాటు పీయూ కాలేజీ, శ్రీ సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్, శ్రీశ్రీ విద్యామందిర్‌ ట్రస్ట్, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్, అమెరికాలో శ్రీశ్రీ యూనివర్సిటీ సహా పలు సంస్థలను నిర్వహిస్తున్నాడు. ఇతని ఆధ్వర్యంలోని ‘శ్రీశ్రీ ఆయుర్వేద’ కంపెనీ ఆయుర్వేద, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలను కొనసాగిస్తోంది. ‘పతంజలి ఆయుర్వేద’తో పోల్చుకుంటే ‘శ్రీశ్రీ ఆయుర్వేద’ ఉత్పత్తుల విక్రయాలు తక్కువే! ‘శ్రీశ్రీ ఆయుర్వేద’ వార్షిక టర్నోవర్‌ దాదాపు రూ.1000 కోట్లు. అయితే, ఇతర సంస్థల ద్వారా శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆదాయం భారీ స్థాయిలోనే ఉంటోంది. దేశ విదేశాల్లో ఈ ç‘సర్వసంగ పరిత్యాగి’ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైమాటే!
***స్వామీ నిత్యానంద
స్వామీ నిత్యానంద చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఇదివరకు సినీనటి రంజితతో రాసలీలల దృశ్యాలతో ఉన్న వీడియోలు వెలుగులోకి రావడంతో వార్తలకెక్కాడు. ఆ తర్వాత కూడా ఇతని చుట్టూ అనేక వివాదాలు చెలరేగాయి. ఆధ్యాత్మిక గురువుల్లో ఈయన రూటే సెపరేటు. చట్టానికి పట్టుబడే పరిస్థితులు చుట్టుముట్టడంతో చాకచక్యంగా దేశం విడిచి పారిపోయి, ఒక దీవిని సొంతం చేసుకుని ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. తన దేశానికి సొంత రిజర్వ్‌ బ్యాంకును, కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన నెలకొల్పిన నిత్యానంద ధ్యానపీఠానికి దేశ విదేశాల్లో శాఖలు ఉన్నాయి. సాక్షాత్తు శివుని అవతారమైన అరుణగిరి యోగీశ్వరుడిని తాను చాలాసార్లు ప్రత్యక్షంగా కలుసుకున్నానని చెప్పుకొనే స్వామీ నిత్యానంద ప్రవచనాల వీడియోలకు యూట్యూబ్‌లో యమ గిరాకీ ఉంది. ఇరవైఏడు భాషల్లో ఇతని పుస్తకాలకూ అదే స్థాయి గిరాకీ ఉంది. స్వామీ నిత్యానంద ఆస్తులు, ఆదాయంపై కచ్చితమైన లెక్కలు ఎవరికీ తెలియవు. అయితే, ఈ రసిక సన్యాసి నికర విలువ రూ.10 వేల కోట్లకు పైమాటేనని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఇతనిపై అత్యాచారం, పిల్లలపై లైంగిక దోపిడీ సహా పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కోర్టు విచారణలకు ఎగనామం పెడుతూ వస్తున్న ఈ స్వాములవారిని పట్టుకోవడానికి పోలీసులు విఫలయత్నాలు చేశారు. చివరకు గత ఏడాది నవంబర్‌ 20న గుజరాత్‌ పోలీసులు అతడు దేశం విడిచి పరారైనట్లు ప్రకటించారు. దేశం నుంచి పారిపోయాక స్వామి నిత్యానంద తొలుత ఈక్వడార్‌ను ఆశ్రయం కోరాడు. ఈక్వడార్‌ ప్రభుత్వం అందుకు నిరాకరించడంతో అక్కడ నుంచి జారుకున్న కొద్ది రోజులకే ఒక దీవిలో ‘కైలాస’ పేరుతో హిందువుల కోసం ఒక దేశాన్ని నెలకొల్పినట్లు వీడియోల ద్వారా ప్రకటించాడు.
***గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌
గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ చాలా విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ‘డేరా సచ్చా సౌధ’ అధినేతగా ఒక వెలుగు వెలిగాడు. దేశ విదేశాల్లో 250 ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నాడు. హర్యానాలోని సిర్సాలో ఇతనికి ఏడువందల ఎకరాల వ్యవసాయ క్షేత్రం, రాజస్థాన్‌లో 175 పడకల ఆస్పత్రితో పాటు వివిధ రాష్ట్రాల్లో మార్కెట్‌ కాంప్లెక్సులు, పెట్రోల్‌ బంకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. చిత్రవిచిత్రమైన ఫ్యాషన్లు, సినిమాలపై ఆసక్తి ఉన్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ‘ఎంఎస్‌జీ–ద మెసెంజర్‌’, ‘ఎంఎస్‌జీ–2 ద మెసెంజర్‌’, ఎంఎస్‌జీ: ద వారియర్‌ లయన్‌ హార్ట్‌’ వంటి కొన్ని సినిమాలు తీసి, వెండితెరపైనా కనిపించాడు.గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆదాయ వివరాలపై కచ్చితమైన లెక్కలేవీ లేకున్నా, ఇతడి నికర విలువ రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఒక వైపు వ్యాపారాలు, మరోవైపు సేవా కార్యకలాపాల ముసుగులో ఈ గురువు సాగించిన దారుణాలు తక్కువేమీ కాదు. సీబీఐ కోర్టు 2017లో ఇతడికి ఒక అత్యాచారం కేసులో ఇరవయ్యేళ్ల శిక్ష విధించింది. తర్వాత రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులో 2019 జనవరిలో ఇతనికి యావజ్జీవ శిక్ష పడింది. ఇతనిపై మరిన్ని క్రిమినల్‌ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.
***మాతా అమృతానందమయి
ఆధ్యాత్మిక గురువుల్లో మాతా అమృతానందమయికి ‘ఆలింగనాల మాత’ (హగ్గింగ్‌ సెయింట్‌) అని పేరు. బాధలు చెప్పుకోవడానికి వచ్చే భక్తులను ఆమె ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఊరడిస్తారు. కేరళకు చెందిన మాతా అమృతానందమయి ‘అమృతానందమయి ట్రస్టు’ను నిర్వహిస్తున్నారు. అమృతా పాఠశాలలు, అమృతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్, అమృత విశ్వవిద్యాపీఠ కాలేజీలు మాతా అమృతానందమయికి ప్రధాన ఆదాయ వనరులు. అమృతానందమయి ఆస్తుల విలువ రూ.1500 కోట్లకు పైమాటే. కొల్లాం సమీపంలోని వల్లికావు అనే చిన్న దీవిలో ఏర్పరచుకున్న ఆశ్రమం ఆమె నివాసం. ఆశ్రమం అంటే అదేదో పర్ణశాల కాదు, అంగరంగ వైభవోపేతమైన సౌకర్యాలతో కూడిన ఐదంతస్తుల భవంతి.ఈ మాతాజీ కూడా వివాదాలకు అతీతురాలు కాదు. ఆమె ఆశ్రమ పరిసరాల్లోని అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు జరిపించాలంటూ మలయాళ దినపత్రిక ‘దేశాభిమాని’ ఒక కథనంలో డిమాండ్‌ చేసింది. అంతకు ముందు 1985లోనే శ్రీని పట్టథనమ్‌ అనే హేతువాద రచయిత ‘మాతా అమృతానందమయి సేక్రెడ్‌ స్టోరీస్‌ అండ్‌ రియాలిటీస్‌’ అనే పుస్తకంలో ఆ మరణాల సంగతిని తొలిసారిగా ప్రస్తావించారు. అమృతానందమయి మాజీ శిష్యురాలు, ఆస్ట్రేలియన్‌ రచయిత్రి గ్రెయిల్‌ ట్రెడ్‌విల్‌ తాను ఆశ్రమంలో ఉన్న కాలంలో అమృతానందమయి తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించింది. అయినా, ఆమెపై ఇంతవరకు ఎలాంటి దర్యాప్తు జరగకపోవడమే విడ్డూరం.