Food

వారణాశి పాన్ తిన్నారా?

Have You Tried Varanasi Pan

వారణాసి మనకు ఆధ్యాత్మిక కేంద్రంగానే తెలుసు! ఆహార ప్రియులకు తెలిసిన కోణం వేరు. వాళ్లు మాత్రం వారణాసి పేరుచెబితే జన్మలో మరిచిపోలేని అద్భుతమైన ఫలహార రుచులే గుర్తుకొస్తాయంటారు. ఏ వీధిలోకి వెళ్లినా నేతి ఘుమఘుమలు, చిక్కని మీగడ తరకలే విందులు చేస్తాయి మరి..పవిత్ర వారణాసిలో అడుగుపెడుతూనే మునుపెన్నడూ మనం రుచిచూడని అల్పాహార రుచులు తమ ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. తెల్లారుతూనే ఆ చిక్కని టీ గొంతులోకి జారుతూ ఉంటే.. ఆహా! ఆరుచినిమరిపించాలంటే మళ్లీ వారణాసి వచ్చి టీ తాగాల్సిందే అంటారు ఆ టీ రుచిని ఆస్వాదించిన వాళ్లు. ఎందుకంత రుచీ అంటే… మనలా నీళ్లపాలతో కాచిన టీ కాదది మరి. చిక్కని మీగడపాలతో మట్టిముంతలో పాలనురుగతో విందులు చేస్తూ తాగాలా… తినాలా అనిపించేలాంటి టీ అది. అందుకే ఆ రుచిని మరిపోలేం. చూరా మటర్‌.. ఇది వారణాసి ప్రత్యేకం. అటుకులు, తాజా పచ్చి బఠానీలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌, నిమ్మరసం వేసి చేసే ప్రత్యేకమైన వంటకం ఇది. అది తిన్న తర్వాత మరింకేదో కొత్తరుచి గురించి తెలుసుకుని తీరాలనే తపన మొదలవ్వడం పక్కా. సరిగ్గా అప్పుడే మీకోసమే అన్నట్టుగా కరకరలాడే కచోరీలు, రబ్డీలో ముంచి తీసిన వేడి జిలేబీలు నోరూరిస్తూ కనిపిస్తాయి. ఇక భోజ్‌పూరీలో మాట్లాడే బిహారీలు తాము తయారుచేసిన బట్టీచోకాలని తిననీయకుండా మనల్ని అక్కడ నుంచి కదలనీయరనుకోండి. ఇంతేనా అని పొరపాటున అనుకుంటే చనాదహీవడా, కలాకండ్‌, లవంగలత, పరవాల్‌ మిఠాయి, సంకట్‌మోచన్‌ హనుమాన్‌ గుడిలోని లడ్డూలు మన మీదికి దాడిచేసినంత పనిచేస్తాయి. ఏంతిన్నా చివరికి వారణాసి పాన్‌ తినకపోతే వారణాసి వెళ్లిన ఫలితం లేకపోయిందే అని బాధపడతారు చూస్కోండి.