Business

హమ్మయ్య…మార్కెట్ తేరుకుంది-వాణిజ్యం

హమ్మయ్య…మార్కెట్ తేరుకుంది-వాణిజ్యం

* దేశీయ మార్కెట్ల నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. నిన్నటి భారీ నష్టాల నుంచి సూచీలు పుంజుకున్నాయి. బుధవారం ఉదయం 9:48 గంటల సమయంలో సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగబాకి 37,971 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 11,215 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.43 వద్ద కొనసాగుతోంది. కీలక రంగాల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఆసియా మార్కెట్ల అప్రమత్తత దేశీయ మార్కెట్ల జోరుకు కాస్త అడ్డుకట్టగా మారింది. ఐరోపా దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణ అక్కడి మదుపర్లను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

* దేశీయ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. అమ్మకాల ఒత్తిడి వల్ల మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో వరుసగా ఐదో రోజూ నష్టాలు చవిచూశాయి. ఉదయం సెన్సెక్స్‌ దాదాపు 200కు పైగా పాయింట్లతో లాభాల్లో ట్రేడయ్యింది. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఒకానొక దశలో 300 పాయింట్లకు పైగా నష్టాల్లోకి వెళ్లి మళ్లీ కోలుకోవడంతో భారీ నష్టాల నుంచి గట్టెక్కింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో అమెరికాకు చెందిన మరో ప్రముఖ సంస్థ కేకేఆర్‌ అండ్‌ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆర్‌ఐఎల్‌ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,550 కోట్లు. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్‌లో కేకేఆర్‌కు 1.28 శాతం వాటా దక్కనుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ మానిటైజేషన్‌ తర్వాత ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ వ్యాపారంపై దృష్టి సారించింది. దాదాపు 10 శాతం వాటాల్ని విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వివిధ పెట్టుబడి సంస్థలను సంప్రదించినట్లు వార్షిక సదస్సులో ఆర్‌ఐఎల్‌ ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన అన్ని సంస్థలకు రిటైల్‌లోనూ అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌వీఎల్‌లో పెట్టుబడుల పెట్టిన రెండో సంస్థ కేకేఆర్‌. ఇప్పటికే సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ రెండూ జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు ఫేస్‌బుక్‌, విస్తా, జనరల్‌ అట్లాంటిక్‌, గూగుల్‌ వంటి ప్రముఖ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల్ని కొనుగోలు చేశాయి.

* చిన్న కంపెనీల షేర్ల(స్మాల్‌ క్యాప్‌) లోనే పెట్టుబడులు పెట్టాలని సెబీ ఎవరిపై ఒత్తిడి సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ వెల్లడించారు. మదుపర్లకు ప్రయోజనం కలిగేలా, నచ్చిన వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని.. అది వాళ్ల ఇష్టమని తెలియజేశారు. మల్టీక్యాప్‌ ఫండ్‌ పథకాల్లో కేటాయింపులకు సంబంధించి ఇటీవల తెచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో యాంఫీ 25వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) సెబీ ఛైర్మన్‌ స్పందించారు. మల్టీక్యాప్‌ ఫండ్‌ పేరులో ఏదైతే ఉందో.. దానికి తగ్గట్లుగానే పెద్ద, మధ్య చిన్న తరహా కంపెనీల షేర్లలో కనీసం 25 శాతం పెట్టుబడులు పెట్టాలని ఆ నిబంధనల్లో ఉందని తెలిపారు. ఇంతకుముందు ఇటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఎక్కువ భాగం పెద్ద కంపెనీల షేర్లలోకే పెట్టుబడులు వెళ్లేవి. ఇప్పుడు ఈ కొత్త నిబంధనల కారణంగా పెద్ద కంపెనీల షేర్ల నుంచి మధ్య తరహా, చిన్న కంపెనీల షేర్లలోకి రూ.30,000- 40,000 కోట్ల మేర పెట్టుబడులు తరలిపోతాయని ఫండ్‌ మేనేజర్లు అంచనా వేస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను అసమగ్రంగా వర్గీకరించడం వల్ల మదుపర్లలో అయోమయ పరిస్థితులు నెలకొంటాయని, తప్పుడు పద్ధతిలో ఫండ్‌ పథకాలను విక్రయించేందుకు అవకాశాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఫండ్‌ పథకంలో మదుపు చేసే ముందు ఆ ఫండ్‌ ఏ విభాగం కిందకు వస్తుంది.. పనితీరు ఎలా ఉంది.. అనే అంశాల ఆధారంగా మదుపర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘ఒక పథకంలో పెట్టుబడి కేటాయింపులు పేరుకు తగ్గట్లుగా లేకపోతే.. మదుపర్లు ఆ పథకం కొనేముందు ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయో ఆశించి సంతకం చేశారో అందుకు భిన్నమైన ప్రతిఫలాన్ని వాళ్లు పొందే పరిస్థితి రావచ్చ’ని త్యాగి వివరించారు.

* ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ కుమార్తె (62) బ్యాంక్‌ ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తి రూ.90,000 ఉపసంహరించినట్లు పోలీస్‌ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని కొలాబా పోలీసు స్టేషన్‌లో ఈ సైబర్‌ నేరాన్ని నమోదు చేశారు. జులైలో మిస్త్రీ నేతృత్వంలోని కంపెనీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (అకౌంట్స్‌)కు బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు ఉపసంహరించినట్లు మొబైల్‌ సందేశం రావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు. మిస్త్రీ ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన లైలా రుస్తుం జహంగీర్‌కు చెందిన బ్యాంక్‌ ఖాతా ఇది. దుబాయ్‌లో లైలా నివాసం ఉంటున్నారు. ఆమె తరఫున తండ్రికి బ్యాంక్‌ ఖాతా నిర్వహించే అధికారం ఉంది. 2018లో కంపెనీ డైరెక్టర్‌ ఫిరోజ్‌ భటెనాకు ఖాతా నిర్వహణ అధికారాన్ని మిస్త్రీ ఇచ్చారు. ఈ మోసపూరిత లావాదేవీ సందేశం మొబైల్‌కి రావడంతో ఈ ఉదంతం బయటపడింది.

* కంపెనీల చట్టం సవరణ బిల్లు 2020కి పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈనెల 19నే లోక్‌సభ ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు, తాజాగా రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. దేశీయ కంపెనీలు నేరుగా విదేశాల్లో నమోదయ్యేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. కొన్ని నేరాలకు జరిమానాల తగ్గింపు, రైట్స్‌ ఇష్యూలకు గడువు, సీఎస్‌ఆర్‌ బాధ్యతలకు మినహాయింపుల వంటివి ఉన్నాయి.