అలీఖాన్ అగ్రశ్రేణి పేసర్లకు దీటుగా బంతులు సంధించగలడు. 2018లో జరిగిన కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో విశేషంగా రాణించాడు. అత్యధిక వికెట్లు తీసి వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. అలా.. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం అమేజాన్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచుల్లోనే 16 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. సీజన్‌లోనే రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏడాది షారుక్‌ఖాన్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ అలీఖాన్‌ను సొంతం చేసుకుంది. బంతికి మరింత పదును పెంచాడు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 7.43 ఎకానమీతో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. తన జట్టును టైటిల్ విజేతగా నిలుపడంలో తనవంతు పాత్ర పోషించాడు. అలా.. సీపీఎల్ ప్రదర్శనతో ఫ్రాంచైజీని విశేషంగా ఆకర్షించాడు. అతనికి అక్కడి నుంచే ఐపీఎల్‌కు బాటలు పడ్డాయి. కోల్‌కతా బౌలర్ హ్యారీ గర్నీ భుజం గాయంతో టోర్నీకి దూరం కావడంతో యాజమాన్యం వెంటనే అలీఖాన్‌కు అవకాశం కల్పించింది.
మహమ్మద్ అసన్ అలీఖాన్.. పుట్టింది పాకిస్థాన్‌లోని పంజాబ్. పెరిగింది అమెరికా. 2016 నుంచి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 36 టీ20 మ్యాచ్‌లాడాడు. కుడి చేతివాటం గల ఈ క్రికెటర్ 27.13 సగటుతో 38 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2019 ఏప్రిల్‌లో పపువా న్యూగినియా వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. బంతిని వేగంగా వేయడం మాత్రమే కాదు.. బంతి బంతికీ వేరియేషన్స్ చూపించడంలో అలీఖాన్ దిట్ట.