Kids

మా స్కూల్‌కి రండి…డబ్బులు తీసుకోండి

This School In UP Pays You For Sending Your Kid To Them

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ పట్టణం సమీపంలోని అనుప్ షహర్ అనే కుగ్రామం 20 ఏండ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడా గ్రామం పేరు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ మార్మోగిపోతుంది. కారణంగా ఆ గ్రామంలోని అమ్మాయిల పాఠశాల. పర్దాదా-పర్దాదీ అంటే ముత్తాత, ముత్తమ్మమ్మ. ఇదే గ్రామానికి చెందిన వీరేందర్ సింగ్ ఈ పాఠశాల ప్రారంభించేందుకు ప్రధాన కారకుడు. తాను పుట్టిపెరిగిన పరిసరాల్లోని అమ్మాయిలకు విద్య అందని పండుగా ఉండటం, వారికి 12 వ ఏటనే వివాహం జరిపించడం కారణంగా ఈ పాఠశాలను ప్రారంభించారు.

అనుప్ షహర్ గ్రామానికి చెందిన వీరేందర్ సింగ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. ఓ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్ గా ఉంటూ రెండు తరాలకు సరిపోయేంత సంపాదించాడు. రిటైర్మెంట్ రాగానే తన మిత్రుల ప్రోత్బలంతో పుట్టినగడ్డకు వచ్చిన వీరేందర్ సింగ్.. అక్కడి మహిళలు, వారి అమాయకత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీరికి సమాజం గురించి తెలియజెప్పాలంటే పాఠశాల ప్రారంభించాలని తలపోసాడు. ఇంటింటికి వెళ్లి అమ్మాయిలను స్కూలుకు పంపాల్సిందిగా కోరారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వారి కూతుర్లను స్కూలుకు పంపకపోవడంతో.. ఎవరైతే స్కూలుకు వస్తారో వారికి రోజుకు రూ.10 ఇస్తానంటూ ప్రకటించాడు. చదువుతోపాటు భోజనం కూడా పెడతామంటూ చెప్పడంతో కొందరు రావడం మొదలైంది. అలా అలా ప్రస్తుతం 1600 మంది అమ్మాయిలు ఆ స్కూలులో చదువుతున్నారు. కొన్నిరోజుల తర్వాత తన ప్రణాళికను మార్చి విద్యార్థులకు నిత్యం డబ్బు ఇవ్వకుండా వారి పేరిట ఖాతాలో వేస్తూ ఇంటర్ వరకు చదివేలా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఇక్కడ చదువుకున్న ఎందరో అమ్మాయిలు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉండగా.. మరికొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

రెండు గదుల్లో ప్రారంభమైన పర్దాదా-పర్దాదీ స్కూల్ ప్రస్తుతం 30 ఎకరాల్లో పెద్ద పెద్ద భవంతుల్లో కొనసాగుతుంది. పలువురు ఎన్నారైల సహకారంతో అత్యాధునిక ల్యాబులు, తరగతి గదులు, హాస్టళ్లను నిర్మించారు. ఏడాదికి ఒక్కో అమ్మాయిపై రూ.39 వేలు ఖర్చు చేస్తున్నారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే వారికి రుణసాయం అందిస్తున్నారు. అది కూడా తాము ఉద్యోగం సంపాదించిన తర్వాత రీపేమెంట్ చేస్తామన్న హామీతో రుణం ఇస్తున్నారు. తమ వద్ద రుణం తీసుకున్న అమ్మాయిలు ఉన్నత విద్య చదువుకుని ఉద్యోగం పొందగానే వంద శాతం మంది రుణాలను తిరిగి చెల్లించారు. ప్రస్తుతం పరిసర 65 గ్రామాల నుంచి 1600 అమ్మాయిలు ఈ స్కూలులో చదువుకుంటున్నారని వీరేందర్ సింగ్ చెప్పారు. వారి గ్రామాల నుంచి వచ్చేందుకు 17 స్కూలు బస్సులను కూడా నడుపుతున్నామని తెలిపారు. అమ్మాయిలు చదువుకోవడం ద్వారా సమాజం మొత్తం సుసంపన్నంగా మారుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల నిమిత్తం పలువురు అమ్మాయిలకు కంప్యూటర్లు, ఫోన్లు, ఇంటర్ నెట్ కనెక్షన్లు, టేబుల్స్ ఇప్పించినట్లు తెలిపారు. ఈ స్కూలుతో పాటు నడుస్తున్న కమ్యూనిటీ డెవలప్ మెంట్ సెంటర్లో పరిసర గ్రామాలకు చెందిన 5 వేల మంది మహిళలు పాలుపంచుకుంటుండటం విశేషం