Editorials

బాలు జీవితప్రస్థానం…

A Glimpse Into The Life Of SP Balu

బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సాంబమూర్తి, శంకుతలమ్మ. ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్న ఆ కుటుంబంలో బాలు రెండో కుమారుడిగా జన్మించారు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా ప్రముఖ గాయని అన్న సంగతి తెలిసిందే.

బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ చూపేవాడు. తండ్రి సాంబమూర్తి హరికథ కళాకారుడు కావడంతో సహజంగానే ఇంట్లో కళా సంబంధమైన వాతావరణం ఉండేది. ఓ రకంగా బాలుకు సంగీతాభిరుచికి జీవం పోసేందుకు ఆ వాతావరణమే కారణమైంది. అయితే తండ్రి కోరిక మేరకు నాటి మద్రాసులో ఇంజినీరింగ్ కోర్సు (ఏఎంఐఈ)లో చేరారు. కానీ పాటను మాత్రం వదల్లేదు. సందర్భం దొరికినప్పుడల్లా తన గానామృతాన్ని పంచుతూ అనేక వేదికలపై బహుమతులు కూడా అందుకున్నారు.

ఆయన ప్రతిభను సినీ రంగం గుర్తించడంతో 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి బాలు వెనుదిరిగి చూసుకున్నది లేదు. ప్రధానంగా తెలుగు, తమిళ భాషల్లో దిగ్గజ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు 40 వేల పాటలు పాడి సినీ చరిత్రలో మరే గాయకుడికి అందనంత ఎత్తుకు ఎదిగారు. బాలు 11 భాషల్లో పాడారు.

బాలు గాయకుడే కాదు నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. మొదటగా 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. ఇక 90వ దశకంలో వచ్చిన కేలడి కన్మణి చిత్రంలో రాధిక సరసన హీరోగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రేమ, ప్రేమికుడు, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాల్లో ఆకట్టుకునేలా నటించి మెప్పించారు. చివరిగా 2012లో వచ్చిన మిథునం చిత్రంలో లీడ్ రోల్ పోషించారు. ఈ సినిమాకు నంది అవార్డు లభించింది.

ఇక డబ్బింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేయడం బాలూకే చెల్లింది. ఏ హీరోకు పాడుతుంటే ఆ హీరో గొంతును అనుకరిస్తూ పాడే బాలుకు డబ్బింగ్ ఏమంత కష్టం కాలేదు. రజనీకాంత్, కమలహాసన్, రఘువరన్, గిరీశ్ కర్నాడ్, సల్మాన్ ఖాన్, జెమినీ గనేశన్ లకు డబ్బింగ్ చెప్పారు.

టెలివిజన్ రంగంలోనూ ఆయన తన ఘనత చాటుకున్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమం ద్వారా అనేక మంది యువ గాయకులను వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఎస్పీ బాలు కుటుంబం గురించి చెప్పుకోవాల్సి వస్తే… ఆయన భార్య పేరు సావిత్రి. బాలు, సావిత్రి దంపతులకు పల్లవి, చరణ్ సంతానం. పాటపై ఉన్న మక్కువతో కుమార్తెకు పల్లవి అని, కుమారుడికి చరణ్ అని పేరుపెట్టుకున్నారు.

ఈ గాన గంధర్వుడి ప్రతిభను గుర్తిస్తూ అనేక అవార్డులు, రివార్డులు వెదుక్కుంటూ వచ్చాయి. రికార్డు స్థాయిలో 29 సార్లు నంది అవార్డు గెలుచుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. జాతీయ అవార్డుల్లోనూ బాలు తన ఘనత చూపారు. ఆరు సార్లు నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఏక్ దూజే కేలియాతో చిత్రంతో హిందీ పాటకు కూడా జాతీయ అవార్డు గెలుచుకోవడం విశేషం అని చెప్పాలి. ఫిలింఫేర్ అవార్డుల్లోనూ ఆరు సార్లు అవార్డులు అందుకున్నారు.

బాలు గాయకుడే కాదు సంగీత దర్శకుడు కూడా. తూర్పు వెళ్లే రైలు, లాయర్ సుహాసిని, తుదిక్కుమ్ కారంగల్, హమ్ పాంచ్, ఊరంతా సంక్రాంతి, మయూరి, నాచే మయూరి, మగధీరుడు, పడమటి సంధ్యారాగం, రాము, నీకూ నాకూ పెళ్లంట, కళ్లు వంటి మొత్తం 23 చిత్రాలకు బాణీలు సమకూర్చారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలున్నాయి. ఆయన 2003లో ఉన్నై చరణదయ్యిందేన్ అనే చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇందులో హీరోగా బాలు కుమారుడు ఎస్పీ చరణ్ నటించారు.
బాలు జీవితప్రస్థానం...