Business

లాభాల్లో మార్కెట్లు…పరుగెత్తిన బులియన్ ధరలు-వాణిజ్యం

లాభాల్లో మార్కెట్లు…పరుగెత్తిన బులియన్ ధరలు-వాణిజ్యం

* భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. వరుసగా ఆరు రోజుల నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 800పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మళ్లీ తన 11వేల మార్కును అందుకుంది. గురువారం నాటి భారీ నష్టాలను కొంతమేర మన మార్కెట్లు పూడ్చుకున్నాయి.

* బంగారం ధర మళ్లీ పెరిగింది. నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర శుక్రవారం ఎగిసింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.324 పెరిగి రూ.50,824కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడమే ఇందుకు కారణం. దీనికి తోడు వెండి ధర కూడా భారీగా పెరిగింది. దిల్లీలో కేజీ వెండి ధర రూ.2,124 పెరిగి రూ.60,536కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర 1873 డాలర్లు ఉండగా.. వెండి 23.10 డాలర్లు ఉంది. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందన్న వార్తతో డాలరు విలువ స్వల్పంగా పడిపోవడంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

* మొబైల్‌ రంగంలో రిలయన్స్‌ జియో జోరు కొనసాగుతోంది. జూన్‌లో కొత్తగా చేరిన 44.9 లక్షల మందితో కలిపి జియో చందాదారుల సంఖ్య 39.7 కోట్లకు చేరింది. వొడాఫోన్‌ ఐడియా చందాదార్లు 48.2 లక్షలు తగ్గి 30.5 కోట్లకు పరిమితమయ్యారు ఎయిర్‌టెల్‌ 11.3 లక్షల మందిని పొగొట్టుకుని, 31.6 కోట్ల కనెక్షన్లకు పరిమితమైంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. జూన్‌ ముగిసేనాటికి మొత్తం వైర్‌లెస్‌ వినియోగదారుల సంఖ్య 0.28 శాతం తగ్గి 114 కోట్లకు చేరింది. పట్టణ, గ్రామీణ పాంత్రాల్లో 0.18 శాతం, 0.40 శాతం చొప్పున ఖాతాదారులు తగ్గారు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు మేలో 68.3 కోట్లు ఉండగా.. జూన్‌కు 2 శాతం వృద్ధితో 69.8 కోట్లకు పెరిగారు. మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల్లో అగ్రగామి 5 సర్వీస్‌ ప్రొవైడర్ల మార్కెట్‌ వాటా 98.93 శాతంగా ఉంది.

* జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) దిగ్గజ ఎస్‌యూవీ మోడల్‌ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ను వచ్చే నెల 15న భారత విపణిలోకి విడుదల చేయనుంది. కంపెనీ ముందస్తు బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. భారత్‌ విపణిలోకి 2009లో ప్రవేశించిన తర్వాత.. మొట్టమొదటిసారిగా ల్యాండ్‌రోవర్‌ డిఫెండర్‌ తీసుకురావడం గర్వకారణమని జేఎల్‌ఆర్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి పేర్కొన్నారు. భారత వాహన పరిశ్రమలోనే ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఈ కారును డిజిటల్‌ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ల్యాండ్‌ రోవర్‌ భారత పోర్ట్‌ఫోలియోలో రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, డిస్కవరీ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ వేలార్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌, డిస్కవరీ, రేంజ్‌ రోవర్‌లు ఉన్నాయి. భారత్‌లో జేఎల్‌ఆర్‌కు 24 నగరాల్లో 27 విక్రయశాలలు ఉన్నాయి.

* టెక్నాలజీ దిగ్గజంగా మారనున్నట్లు రష్యా అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్బెర్‌బ్యాంక్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా డిజిటల్‌ రంగంలో పలు ఉత్పత్తులు, సేవలను విడుదల చేసింది. ముందుగా వీటిని రష్యా మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. తర్వాత భారత్‌ సహా ప్రపంచ దేశాల్లో ప్రవేశపెట్టనుంది. అయితే కొత్త ఉత్పత్తులు రష్యాలో విజయవంతం కావడంపై ఈ విస్తరణ ఆధారపడి ఉంది. విదేశాల్లో నియంత్రణ సంస్థల అనుమతులు, ఇతర అంశాలు కూడా కీలకం కానున్నాయి. యాపిల్‌ యాప్‌స్టోర్‌, గూగుల్‌ ప్లే వంటి యాప్‌ల ప్లాట్‌ఫామ్‌ స్మార్ట్‌మార్కెట్‌ను కూడా స్బెర్‌బ్యాంక్‌ తీసుకొచ్చింది. వర్చువల్‌ అసిస్టెంట్‌ సెల్యూట్‌, టీవీ స్ట్రీమింగ్‌ పరికరం స్బెర్‌బాక్స్‌, మల్టీమీడియా స్మార్ట్‌ డిస్‌ప్లే పరికరం స్బెర్‌పోర్టల్‌ విక్రయాలు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ మాదిరిగా సినిమాలు, టీవీ సిరీస్‌, పాటలు అందించే స్బెర్‌ప్రైమ్‌ను ఆవిష్కరించింది. గ్రోసరీ డెలివరీ సేవలు దీనికి అదనం.